బంగ్లాదేశ్ ప్రస్తుతం హింస కొనసాగుతూనే ఉంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఇటీవలే కొందరు దుండగులు హిందువులపై దాడి చేసి హతమార్చారు. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లోని హిందువులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యపై బంగ్లాదేశ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ హత్యను రాజకీయ ప్రతీకార చర్యగా బంగ్లాదేశ్ పోలీసులు అభివర్ణించారు. అవామీ లీగ్, ఛత్రా లీగ్‌తో సంబంధం ఉన్న దాదాపు 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా.. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
హాది బహిరంగ వ్యాఖ్యలు అవామీ లీగ్, ఛత్రా లీగ్ దాని అనుబంధ సమూహాల నాయకులు, కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేశాయని ఢాకా అదనపు పోలీస్ కమిషనర్ మొహమ్మద్ షఫీకుల్ ఇస్లాం అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఫైసల్ కరీం మసూద్‌కు ఛత్రా లీగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు తైజుల్ ఇస్లాం చౌదరి బప్పీ పల్లబి థానా ఛత్రా లీగ్ అధ్యక్షుడు, అవామీ లీగ్ నామినేట్ చేసిన వార్డు కౌన్సిలర్ అని వెల్లడించారు. హత్య తర్వాత మసూద్,మరో కీలక నిందితుడు అలంగీర్ షేక్ పారిపోవడానికి అతను సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజకీయ ప్రతీకారం కారణంగానే హాది హత్యకు గురయ్యాడని దర్యాప్తులో తేలిందని ఏసీపీ ఇస్లాం అన్నారు.
కాగా.. ఛత్రా లీగ్ అనేది బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం. తాజాగా ఈ విభాగానికి చెందిన 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు హాదీ హత్య తర్వాత న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాది పార్టీ, ఇంక్విలాబ్ మంచా ఢాకాలో ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులందరికీ పని కల్పించడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు హాదీ హత్య నిందితులు భారతదేశంలో ఆశ్రయం పొందారని ఆరోపిస్తున్నారు. వారిని అప్పగించడానికి నిరాకరిస్తే ఢాకా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఇంక్విలాబ్ మంచా హెచ్చరించింది. అయితే హాది హంతకులు భారతదేశంలోకి ప్రవేశించారనే వాదనలను భారత అధికారులు తోసిపుచ్చారు. వారు తమ సరిహద్దు దాటినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.


