దేశంలోని స్కూళ్లలో పాఠ్యేతర పుస్తకాలు చదివించడం ఒక విధానంగా ఉంది. కాని ‘స్క్రీన్ టైమ్’ విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో బడిలో తప్పనిసరిగా రోజూ న్యూస్‌పేపర్లు చదివించాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. కేరళలో ఈ ప్రయత్నం గతేడాదే మొదలైంది. పిల్లలు రోజూ స్కూల్ అవర్‌లో న్యూస్‌పేపర్ చదివితే కలిగే ప్రయోజ నాలేమిటో నిపుణులుచెప్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్‌ను బట్టి కొన్ని గమనింపులు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం కోసం తల్లిదండ్రుల ఒత్తిడి మొదలవ్వాల్సి ఉంది.
పిల్లలు స్మార్ట్ ఫోన్‌లకు మనం ఊహిస్తున్న దాని కంటే ఎక్కువే అలవాటు పడ్డారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేందుకు ఫోన్ వంక చూస్తున్నారు. అయితే కావాల్సిన సమాచారానికి మించి అనేక విషయాలు అందులో ఉండటంతో గంటలకొద్దీ అక్కడే గడుపుతున్నారు. ఇది క్రమంగా వ్యసనంగా మారుతోంది. దీన్ని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
పాఠశాలలో రోజూ 45 నిమిషాల పాటు దినపత్రికలు చదివే విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీనివల్ల పిల్లలు ఫోన్ చూసే సమయం తగ్గుతుందని, చుట్టూ జరిగే విషయాల పట్ల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నాయి. ఢిల్లీ కూడా ఈ విధానంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కేరళ ప్రభుత్వం ఈ విధానాన్ని గత సంవత్సరమే ప్రవేశపెట్టింది.
సమాధానం చెబితే బహుమతి
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం దినపత్రికలు చదివే విధానం అమలులో ఉండేది. కొన్ని స్కూల్ లైబ్రరీలకు దినపత్రికలు, మాసపత్రికలు వచ్చేవి. అయితే కాలక్రమంలో నిధుల కొరత, నిర్వహణా లోపాల కారణంగా ఆ విధానానికి స్వస్తి పలికారు. కొన్నిచోట్ల మినహా చాలా ప్రాంతాల్లో ఆ విధానాన్ని పాటించడం లేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపటంతో తిరిగి ఆ విధానం అమల్లోకి వచ్చింది. రోజూ 45 నిమిషాల పాటు దినపత్రిక చదివేందుకు కేటాయిస్తారు. ఒక్కో విద్యార్థికి ఒక దినపత్రిక కేటాయిస్తారు. వారు శ్రద్ధగా చదువుతున్నారా, లేదా అని పరిశీలించేందుకు ఆ రోజు వార్తల్లోని ఒక అంశంపై టీచర్ ప్రశ్న వేస్తారు. సరైన సమాధానం చెప్పిన విద్యార్థికి చాక్లెట్ బహుమతిగా అందిస్తారు.
ఫోన్ చూడటం మానేస్తారా?
దినపత్రికలు చదివించడం వల్ల పిల్లలు ఫోన్ చూడటం మానేస్తారా? అనేకమందిలో కలుగుతున్న సందేహం ఇది. పేపర్లు చదివించడానికీ, ఫోన్ చూడటానికీ మధ్య సంబంధం ఏమిటనేది కొందరి ప్రశ్న. దినపత్రికలు చదవడం వల్ల ఫోన్ చూడటం మానేస్తారని కచ్చితంగా చెప్పలేమని విద్యావేత్తలు అంటున్నారు. ఇదొక ప్రయత్నమని, ప్రతి విషయానికీ ఇంటర్‌నెట్ మీద ఆధారపడటం మానేందుకు ఇది ఉపకరిస్తుందని అంటున్నారు.
ఈ విధానం వల్ల పఠనం పట్ల ఆసక్తి పెరిగి, ఫోన్ అలవాటుకు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో దినపత్రికలు చదవడాన్ని కచ్చితంగా అమలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం దీన్ని ఐచ్చికం చేశారు. పిల్లల చేత బలవంతంగా దినపత్రికలు చదివించలేమని, అలా చదివించినా వారికి అందులోని విషయాలేమీ ఎక్కవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
పిల్లల అంతరంగంలో ఏముంది?
పాఠశాలలో దినపత్రికలు చదివించే అంశం పట్ల విద్యార్థుల నుంచి సానుకూలత వస్తోంది. దీనివల్ల రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని, తమ భాష కూడా మెరుగుపడిందని అంటున్నారు. తాము తెలుసుకున్న విషయాలు ఇంటికెళ్లి తల్లిదండ్రులతో చెప్తున్నామని, వారంతా ఆనందపడుతున్నారని అంటున్నారు.
విద్యార్థులు ఎక్కువగా క్రీడావార్తల పట్ల ఆసక్తి చూపుతుండగా, పెద్ద తరగతుల్లోని వారు రాజకీయ వార్తలను ఇష్టంగా చదువుతున్నారు. దీర్ఘకాలంలో ఈ దినపత్రిక పఠనం విద్యార్థుల్లో గణనీయమైన అభివృద్ధికి కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నం జరగడం గురించి తల్లిదండ్రులు చర్చ లేవనెత్తాలి.
సామాజిక అంశాల పట్ల అవగాహన
ప్రభుత్వాలు పిల్లల చేత వార్తాపత్రికలు చదివించాలని శ్రద్ధ చూపడాన్ని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. పిల్లలు పేపర్లు చదవడం వల్ల సామాజిక అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని, వారిలో ఆత్మస్థైర్యం, వివేకం పెరుగుతాయని అంటున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టేవారికి ఇదొక ఆటవిడుపుగానూ ఉంటుందని, లోకంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం చిక్కుతుందని అంటున్నారు. దినపత్రికల్లో ప్రాంతీయ భాషకే ప్రాధాన్యం. రెండవ స్థానంలో ఇంగ్లిష్ న్యూస్‌పేపర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. దీనివల్ల ఇరుభాషల్లో నైపుణ్యాలు పెరుగుతాయని అంటున్నారు.
(చదవండి: భారత ఆర్మీ ఆఫీసర్‌గా సెక్యూరిటీ గార్డ్ కుమార్తె ..! జస్ట్ 22 ఏళ్లకే..)


