నేటి పాత స్మార్ట్‌ఫోన్లే... రేపటి ఫైటర్‌ జెట్లు!  | Your old smartphone hides a rare treasure that could help India | Sakshi
Sakshi News home page

నేటి పాత స్మార్ట్‌ఫోన్లే... రేపటి ఫైటర్‌ జెట్లు! 

Feb 23 2026 4:47 AM | Updated on Feb 23 2026 8:23 AM

Your old smartphone hides a rare treasure that could help India

ఫోన్ల నుంచి అరుదైన మూలకాల వెలికితీతకు యత్నాలు

కొత్త ఫోన్‌ కొనగానే పాతదానిని చెత్త ఫోన్‌ అంటూ చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు. కానీ ఆ పాత ఫోన్‌లో ‘రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌’గా పిలిచే అత్యంత విలువైన భూ అయస్కాంత మూలకాలు అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉంటాయి. వాటిని విదేశాల నుంచి వేలాది కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకునే బదులు ఈ పాత ఫోన్ల నుంచే సంగ్రహిస్తే? కేంద్రం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేస్తోంది. 

తద్వారా లక్షల కోట్ల విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని భావిస్తోంది! ‘‘టన్ను ముడిఖనిజం నుంచి కేవలం ఒకట్రెండు కిలోల కోబాల్ట్‌ మాత్రమే తీయగలం. అదే టన్ను పాత బ్యాటరీల నుంచి ఏకంగా 50 నుంచి 80 కేజీల దాకా సమీకరించవచ్చు. పైగా ముడిఖనిజ కోబాల్ట్‌ కంటే ఇది 40 ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది’’ అని గ్రేటర్‌ నోయిడా కేంద్రంగా పనిచేసే లిథియం–అయాన్‌ బ్యాటరీ తయారీ సంస్థ ‘లోహం’ రీసైక్లింగ్‌ హెడ్‌ సయ్యద్‌ గజన్‌ఫర్‌ అబ్బాస్‌ సాఫ్వీ చెప్పారు. 

‘‘ఇప్పటికే ఎంతో శ్రమించి తయారుచేసిన స్మార్ట్‌ఫోన్‌ వంటి ఈ–వేస్ట్‌లో ఎంతో విలువైన ఖనిజాలుంటాయి. వాటిపై భారత్‌ ఇప్పటిదాకా సరైన దృష్టి సారించలేదు’’ అని ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్, లిథియం–అయాన్‌ బ్యాటరీ కంపెనీ అట్టెరో సహ వ్యవస్థాపకుడు నితిన్‌ గుప్తా చెప్పారు. యుద్ధ విమానాలు అత్యంత తేలిగ్గా, అత్యంత దృఢంగా ఉండటానికి నియోడైమియం వంటి ఈ మూలకాలే కారణం. వాటిలో ఇంధనం ప్రవాహాలు, రెక్కల కదలికలు, కాక్‌పిట్‌కు కరెంటు సరఫరా చేసే జనరేటర్లను పర్యవేక్షించే సెన్సార్లకు అవే శక్తినందిస్తాయి.

 ‘‘భారత్‌ ప్రస్తుతం ఈ–వేస్ట్‌ను విదేశాలకు అనవసరంగా ఎగుమతి చేస్తోంది. అలాగాక భారత్‌లోనే భారీగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ–వేస్ట్‌లోని భూ అయస్కాంత మూలకాలను సంగ్రహించి యుద్ధ విమానాల తయారీకి సది్వనియోగం చేసుకోవచ్చు. అత్యంత అరుదైన ఖనిజాల కోసం చైనా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడే దురవస్థ తొలగుతుంది’’ అని ముంబై కేంద్రంగా పనిచేసే శుద్ధ సాంకేతిక సంస్థ ‘లీకో’ సీఈవో గౌరవ్‌ దోల్వానీ అన్నారు. 
 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement