వందలసార్లు చార్జ్‌ చేసినా... అస్సలు తగ్గని సామర్థ్యం!  | Indian Researchers Develop Water Based Zinc‑Ion Battery That Retains 98% Capacity After 500 Cycles | Sakshi
Sakshi News home page

వందలసార్లు చార్జ్‌ చేసినా... అస్సలు తగ్గని సామర్థ్యం! 

Feb 23 2026 4:37 AM | Updated on Feb 23 2026 11:24 AM

Zinc ion battery invention

జింక్‌ అయాన్‌ బ్యాటరీ ఆవిష్కరణ 

నీటి ఆధారిత మూలకాలతో తయారీ

మనం ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలన్నీ మండే స్వభావమున్న రసాయనాలతో తయారు చేసినవే. వాటికి పూర్తి భిన్నంగా నీటి ఆధారిత అణువులతో రూపొందిన వినూత్న జింక్‌ అయాన్‌ బ్యాటరీని సెంటర్‌ ఫర్‌ నానో అండ్‌ సాఫ్ట్‌ మెటీరియల్స్‌ (సీఈఎన్‌ఎస్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో పునరుద్పాతక ఇంధన నిల్వ మరింత భద్రంగా, చవగ్గా, విశ్వసనీయంగా మారనుంది. 

ఈ విధానంలో తయారైన జింక్‌ అయాన్‌ బ్యాటరీని 500 సార్లు చార్జ్‌ చేసి వాడాక కూడా అచ్చం కొత్తదాని మాదిరిగా ఏకంగా 98 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు! సౌర ఫలకాలు, విండ్‌ టర్బైన్ల నుంచి తయారైన విద్యుత్‌ను నిల్వచేసేందుకు దోహదపడే జింక్‌ భూమిపై చవగ్గా, సులభంగా, విస్తారంగా లభిస్తుంది.

 బ్యాటరీలో జింక్‌ ఒకవైపు పొరగా పనికొస్తుంది. మరోవైపు క్యాథోడ్‌గా ఏ మూలకాన్ని వాడాలనేది ఇన్నాళ్లూ సమస్యగానే మిగిలిపోయింది. ఈ సవాలుకు మాలిబ్డినం డైసలై్పడ్‌తో సీఈఎన్‌ఎస్‌ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపారు. మాలిబ్డినం, సల్ఫర్‌లతో దాన్ని తయారుచేశారు. సల్ఫర్‌ నుంచి అత్యంత పల్చటి పొరలను అభివృద్ధి చేశారు. అవి శక్తిని నిల్వ చేసుకోవడమే గాక నిరంతరాయంగా సరఫరా కూడా చేయగలవని నిరూపించారు. 

నియంత్రిత వేడి వ్యవస్థ విధానం ద్వారా దీన్ని సుసాధ్యంచేశారు. దీంతో బ్యాటరీని చార్జ్‌ చేసినప్పుడు శక్తి సులభంగా లోపలికి వెళ్లడమే గాక అంతే సులభంగా డిశ్చార్జ్‌ అవుతోంది. భద్రమైన, అత్యంత సుస్థిరమైన ఆపరేటింగ్‌ పరిమితి అయిన 0.2–1.3 ఓల్ట్‌ స్థాయిని శాస్త్రవేత్తలు సాధించారు. తద్వారా బ్యాటరీ పాడవకుండా వందలసార్లు చార్జ్‌ చేసుకుని వాడుకోవచ్చు.

 చార్జింగ్‌ అనంతరం వాడే క్రమంలో కేవలం 0.3 శాతం శక్తి మాత్రమే వృథాగా పోతోంది. మిగతాదంతా బ్యాటరీలోనే నిల్వ ఉంటోంది. ఇలా 99.7 శాతం ‘కొలంబిక్‌ ఎఫీషియెన్సీ’ సాధించడం విశేషం. ఈ కాయిన్‌–సెల్‌ నమూనా బ్యాటరీని ఎల్‌సీడీ టైమర్‌కు చార్జింగ్‌ పెట్టడం ద్వారా వాణిజ్య స్థాయిలో విజయవంతంగా పరీక్షించారు. ఈ పరిశోధన వివరాలు అమెరికా కెమికల్‌ సొసైటీ ‘ఎనర్జీ అండ్‌ ఫ్యూయల్స్‌’ జర్నల్‌లో 
ప్రచురితమయ్యాయి. 

– న్యూఢిల్లీ  
 

Advertisement
 
Advertisement
Advertisement