పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర చార్జీలు మినహాయింపు | Interstate charges waived for renewable power projects | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర చార్జీలు మినహాయింపు

Jun 12 2025 4:55 AM | Updated on Jun 12 2025 4:55 AM

Interstate charges waived for renewable power projects

2028 జూన్‌ 30 లోపు ప్రారంభించే ప్రాజెక్టులకు వర్తించేలా గడువు పొడిగించిన కేంద్రం

హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ప్రయోజనం

ఇదే ప్రయోజనంతో సెకీతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం

సెకీ విద్యుత్‌ను తీసుకోని కూటమి సర్కారు

సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్‌టీఎస్‌) ఛార్జీల మినహాయింపును కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మరో మూడేళ్లు పొడిగించింది. 2028 జూన్‌ 30 లోపు ప్రారంభించే హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ (పీఎస్పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (బీఈఎస్‌ఎస్‌) తదితర ప్రాజెక్టులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. 

ఈ వెసులుబాటు వల్ల ప్రాజెక్టు ఖర్చు తగ్గుతుందని వెల్లడించింది. పవర్‌ గ్రిడ్‌ స్థిరత్వం, సమర్థవంత నిర్వహణకు ఆర్‌ఈ ప్రాజెక్టులు ఉపయోగ­పడతాయని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగా లీగల్‌ టీమ్‌లు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లను రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది.

‘ఐఎస్‌టీఎస్‌’ వెలుసుబాటుతో గతంలోనే ఒప్పందాలు
వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించే లక్ష్యంతో  పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే సమయంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం 2021 జనవరిలో కేంద్రం ఐఎస్‌టీఎస్‌ చార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. 

అనంతరం ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయింపుతో యూనిట్‌ కేవలం రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ 2021 సెప్టెంబర్‌ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) రాష్ట్రానికి లేఖ రాసింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాత 2021 డిసెంబర్‌ 1న సెకీతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పటి వరకూ కూటమి ప్రభుత్వం సెకీ విద్యుత్‌ను తీసుకోలేదు. 

పైగా ఐఎస్‌టీఎస్‌ చార్జీలు వర్తిస్తాయంటూ టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా 44.79 గిగావాట్ల పునరుత్పా­దక సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ (పీఎస్‌పీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. వివిధ జిల్లాల్లో ఉండే నీటి వనరులను ఉపయో­గించుకొని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టు­లకు రూపకల్పన చేసింది. 

ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజిబులిటీ అధ్యయనం చేసి, 20,900 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన ప్రాజె­క్టులకు  డీపీఆర్‌లు కూడా పూర్తి చేసింది. ఇందులో 16,180 మెగావాట్ల ఉత్పత్తికి వివిధ కంపెనీలకు అనుమతులు కూడా ఇచ్చింది. వీటిని  కూడా కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఈ మూడేళ్లలోనైనా ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తే అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు పొంది, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement