కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు! | New Twist In Janu Case: Police Investigate That Angle Also | Sakshi
Sakshi News home page

కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!

Jun 20 2026 11:26 AM | Updated on Jun 20 2026 12:25 PM

New Twist In Janu Case: Police Investigate That Angle Also

సాక్షి, కాకినాడ: తుని మండలం ఎస్‌.అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. అధికారిక బృందాలు దాదాపు రెండు వారాలు సెర్చ్‌ ఆపరేషన్‌ పేరిట అణువణువు జల్లెడ పట్టినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో.. పోలీసులు మరో కోణంలో ఈ కేసును దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. 

ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ.. పెంపుడు కుక్కతో పాటే కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు, స్థానికులు, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ జానూ ఆచూకీ లభించలేదు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ప్రధానంగా సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా సాగుతున్న విచారణలో తాజాగా ‘కిడ్నాప్‌ కోణం’పై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. 

దర్యాప్తులో భాగంగా.. ఓ కొత్త సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు చిన్న క్లూగా భావిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండాపోయిన పెంపుడు శునకం అదే రోజు గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద తిరుగుతూ కనిపించింది. మధ్యాహ్నం 1.02 గంటల సమయంలో అది ఆందోళనగా అటు ఇటు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు.

మూడు రోజుల తర్వాత అదే శునకం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అది కనిపించన వాళ్ల మీద దాడి చేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించసాగింది. వైద్యం తర్వాత అది కోలుకున్నాక జీపీఎస్‌ ట్రాకర్‌ కట్టి వదిలినా.. ఫలితం దక్కలేదు. చివరకు.. అది చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. 

కిడ్నాప్‌ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 6 వేలకుపైగా ఫోన్‌ కాల్స్‌ను విశ్లేషించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులపై కూడా దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కొండ మీద ఉండే ముఠాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్లు పెట్టిన కరెంట్‌ ఉచ్చుకి చిన్నారి చిక్కుకుందా? మరేమైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్నారు. అలాగే.. 

జిల్లాలో ఇలాంటి కేసుల గత రికార్డులు, అనుమానితుల కదలికలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సంచార జాతులు, వ్యక్తులపై కూడా బృందాలు విచారణ జరుపుతున్నాయి. పిఠాపురం, కోటవురట్ల, దివి పోలవరం ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో క్లూ దక్కుతుందేమోనన్న ఆశతో.. ఏ సీసీటీవీ కెమెరాను వదిలిపెట్టడం లేదు.

మరోవైపు శునకం అనారోగ్యంతో మరణించిందని చెబుతున్నా.. శవపంచనామా, పోస్టుమార్టం నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఆ రిపోర్ట్‌ రాకపోవడంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అది నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసులే తేల్చాలంటూ జానూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ నివేదిక వస్తే కేసులో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.  

జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు సీసీ కెమెరాలో కుక్క కీలక క్లూ..?

ఆ చిన్నారి జానూ కాదు!
ఇదిలా ఉంటే.. తుని మార్కెట్‌ యార్డ్‌ దగ్గర గుర్తుతెలియని ఓ చిన్నారి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఏడ్చుకుంటూ ఆమె ఓ మహిళ దగ్గరకు వెళ్లగా.. అనుమానంతో ఆమె పోలీసులకు అప్పగించింది. అయితే ఆ చిన్నారి జానూ కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

ఇక.. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మంత్రాలు, తంత్రాల పేరుతో ఇంటికి వచ్చి తమను అయోమయానికి గురిచేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెంపుడు శునకం కదలికల నుంచి మొదలైన అనుమానాలు.. ఇప్పుడు కిడ్నాప్‌ కోణం వరకు చేరుకున్నాయి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కని మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా మారింది.

ఇదీ చదవండి: పోలీసులే హంతకులైతే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement