సాయికృష్ణ లాకప్‌డెత్‌పై రాష్ట్రవ్యాప్త చర్చ
సాతాన్‌కుళం ఘటనలోనూ ఇదే జరిగిందని గుర్తుచేసుకుంటున్న వైనం
జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే సాయికృష్ణ లాకప్‌డెత్
ఆ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. రెండు కేసులకూ పలు సారూప్యతలు
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్‌కుళం), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్‌డెత్‌లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్‌లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్‌డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి
విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


