సాక్షి, అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లా అనకాపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి టోల్ గేట్ వద్ద ఈ గంజాయి ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి 1300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి రూరల్ పిఎస్ పరిధిలో ఈ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి టోల్ గేట్ వద్ద మాటు వేసి, గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీతో పాటు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20,870 కిలోల గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు పరవాడలోని కోస్టల్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో పోలీసులు గంజాయి నెట్‌వర్క్‌లపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 1,142 కేసులు నమోదు చేసి, 3,377 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 65,560 కిలోల గంజాయి, 83.19 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీ నం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన 832 వాహనాలను సీజ్ చేశారు. 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11.02 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. శ్రీలంక డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ఛేదించి, రూ.1.07 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ముఠాను పట్టుకుని, రూ.1.04 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సాయంతో 144 హాట్‌స్పాట్లను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 28 స్టాటిక్, 480 డైనమిక్ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించారు.


