తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన | Rare Tornado Spins Sight At Tamil Nadu Thoothukudi, Stuns Residents Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

Jun 22 2026 9:20 AM | Updated on Jun 22 2026 10:30 AM

Viral Video Rare tornado spins sight At Tamil Nadu Thoothukudi

చెన్నై: తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తుత్తూకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ (Funnel Cloud) కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్‌లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని "టోర్నడో అలీ" ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తుత్తూకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆదివారం సాయంత్రం తూత్తుకుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత (Atmospheric Instability), తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండటంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తిస్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీని వల్ల టోల్‌ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. 

టోర్నడో అంటే ఏమిటి?
టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం (Thunderstorm Cloud) నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాకినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. అయితే, భారత్‌లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement