ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్ల
నేతృత్వంలో తనిఖీలు
సాక్షి, చైన్నె: తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా, తాంబరం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రైవేటు విద్యార్థుల నివాసాలపై పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పొత్తేరి, మరైమలై నగర్, గూడువాంచేరి, వల్లంచేరి, కాట్టాంగుళత్తూర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్టళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. మూడు టీమ్‌లకు ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్లు నాయకత్వం వహించగా, 100 మందికి పైగా పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయి ఒకేసారి ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగడంతో విద్యార్థుల నివాస ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.
గంజాయి విక్రయాలపై
ఫిర్యాదులతో రంగంలోకి..
ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నవేలాది మంది విద్యార్థులు పొత్తేరి, దాని పరిసర ప్రాంతాల్లోని లాడ్జీలు, అపార్ట్‌మెంట్‌లలో గదులు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతాల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని పోలీసులకు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు.
ఇటీవల ఎయిర్ గన్ బెదిరింపు ఘటన..
సమీప కాలంలో ఓ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి, తోటి విద్యార్థిని ఎయిర్ గన్ తో బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అంతేకాకుండా, విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు విక్రేతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గతేడాది కూడా ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా రైడ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భద్రతను నిర్ధారించడంతో పాటు, మత్తు పదార్థాలు విక్రయించే ముఠాలను సమూలంగా అంతమొందించేందుకు నిఘాను మరింత తీవ్రతరం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మాదకద్రవ్యాల వినియోగంపై వచ్చిన సమాచారంతో చర్యలు


