కేంద్రపాలిత ప్రాంతాల
సాక్షి, చైన్నె : కేంద్రపాలిత ప్రాంతాలను బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని, పుదుచ్చేరి రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి ప్రధాని కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పోలీస్ విభాగానికి ‘రాష్ట్రపతి వర్ణ పతాక’ (ప్రెసిడెంట్స్ కలర్) పురస్కారం ప్రదానం నిమిత్తం రెండు రోజుల పర్యటనగా శనివారం రాత్రి తిరువణ్ణామలై నుంచి కారులో పుదుచ్చేరి చేరుకున్న అమిత్ షా, ఆదివారం ఉదయం గోరిమేడు పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి పోలీసు రంగానికి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాశ్‌నాథన్, ముఖ్యమంత్రి ఎన్. రంగసామి, తాత్కాలిక స్పీకర్ అన్బళగన్, మంత్రులు నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు, రాజవేలు, శివకొళుందు, రాజశేఖర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గౌరవప్రదమైన పురస్కారం
ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ దేశంలో అతికొద్ది రాష్ట్రాల పోలీసు విభాగాలకు మాత్రమే ఈ రాష్ట్రపతి పతాక గౌరవం లభించిందన్నారు. 4 వేర్వేరు ప్రాంతాలుగా విస్తరించి ఉన్న పుదుచ్చేరిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చూపిస్తున్న అంకితభావం అభినందనీయమన్నారు.
4 రెట్లు పెరిగిన నిధులు
1950 నుండి 2014 వరకు పుదుచ్చేరికి కేంద్రం రూ.35,000 కోట్లు మాత్రమే ఇవ్వగా, 2014 నుండి 2026 వరకు ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.13,762 కోట్లు అందించిందని తెలిపారు. గడిచిన 12 ఏళ్లలో 4 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని వివరించారు.
రూ. 39,000 కోట్లతో పథకాలు..
గత 9 ఏళ్లలో పుదుచ్చేరిలో రూ. 39,000 కోట్ల అంచనాతో పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. రూ. 2,500 కోట్లతో రహదారుల విస్తరణ, రూ. 2,200 కోట్లతో కారైక్కాల్ జాతీయ రహదారి విస్తరణ, విమానాశ్రయం 34 మీటర్ల విస్తరణ పనులు జరిగాయి అని తెలిపారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పుదుచ్చేరిలో సుమారు 7.7 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు.
రాష్ట్రాలతో పాటూ కేంద్రపాలిత ప్రాంతాలనూ అభివృద్ధి పథంలో నడిపించడమే కేంద్రప్రభుత్వ లక్ష్యమని హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎండదెబ్బకు పడిపోయిన పోలీసులు..
ఈ సందర్భంగా జరిగిన పరేడ్ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా మహిళా, పురుష పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6:00 గంటలకే మైదానానికి చేరుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయ్యే వరకు (ఉదయం 10 గంటల వరకు) దాదాపు 4 గంటల పాటు ఎండలో నిలబడాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండ, అలసట కారణంగా కొందరు మహిళా, పురుష పోలీసులు మైదానంలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే సిబ్బంది వారిని స్ట్రెచర్లపై ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. దీంతో కాసేపు కార్యక్రమంలో కలకలం చోటు చేసుకుంది.


