సాక్షి,చైన్నె: తమిళనాడులోని తేని జిల్లా మేఘమలై, వరుసనాడు ప్రాంతాల్లో ఉన్న అటవీ గ్రామాల ప్రజలను వారి నివాస స్థలాల నుంచి ఖాళీ చేయించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్పందిస్తూ.. తేని జిల్లా ఆండిపట్టి తాలూకా పరిధిలోని తుమ్మకుండు, మేఘమలై సహా 98 కొండ గ్రామాల్లో తరతరాలుగా నివసిస్తున్న 5,000 మందికి పైగా ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడం విచారకరమని పేర్కొన్నారు. ఒక శతాబ్దానికి పైగా గిరిజనులు, కొండ ప్రాంత ప్రజలు ఈ భూముల్లో జీడిపప్పు, మిరియాలు, ఏలకులు, లవంగాలు వంటి పంటలను సాగు చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతూజీవిస్తున్నారని తెలిపారు.
నిజమైన ముప్పు కార్పొరేట్లు,
అక్రమ నిర్మాణాల వల్లే..
ఆధునిక సాంకేతిక సౌకర్యాలకు దూరంగా, ప్రకతితో మమేకమై జీవిస్తున్న గిరిజనులు అడవులకు ఆస్తి వంటి వారని సీమాన్ పేర్కొన్నారు. నిజానికి కార్పొరేట్ సంస్థల వాణిజ్య రహిత పరిశ్రమలు, కమ్యూనికేషన్ టవర్లు, లగ్జరీ రిసార్టులు, రోడ్లు, అక్రమ కలప రవాణా వల్ల మాత్రమే అడవులు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు. స్థానిక ప్రజలను ఖాళీ చేయించడం ద్వారా ఆ భూములు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి మరింత పర్యావరణ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం తేని జిల్లా మేఘమలై, వరుసనాడు అటవీ గ్రామ ప్రజలకు తక్షణమే ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలి. కొండ గ్రామాల నుంచి ప్రజలను నిర్వాసితులను చేసే చర్యలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు.
సీమాన్


