బ్యాంకు కాటుకు రైతు దెబ్బ! | Canara Bank 0.66 case is a viral incident from Sakleshpur, Karnataka | Sakshi
Sakshi News home page

బ్యాంకు కాటుకు రైతు దెబ్బ!

Aug 9 2026 5:44 AM | Updated on Aug 9 2026 5:44 AM

Canara Bank 0.66 case is a viral incident from Sakleshpur, Karnataka

టిట్‌ ఫర్‌ ట్యాట్‌ అనండి.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనండి.. ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హాసన్‌ జిల్లా సకలేశ్‌పుర కెనెరాబ్యాంకులో జరిగిన ఈ ఘటన మాత్రమిప్పుడు సోషల్‌ మీడియాలో పిచ్చవైరల్‌ అవుతోంది. ‘‘రైతన్నా.. పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పావు’’అన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే... చొక్కన గౌడ అనే రైతు కెనెరాబ్యాంకు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. 

ఠంచనుగా తిరిగి కట్టేశాడు కూడా. హమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికెళితే.. కొంత కాలానికే బ్యాంకు నుంచి ఒక నోటీసొచ్చింది. ఇదేమిటబ్బా అని చూస్తే అతడికి షాక్‌.. ‘‘ఇంకో 9.34’’రూపాయలు బాకీ ఉన్నావు. కట్టూ అంటూ బ్యాంకు తాఖీదు. బ్యాంకు అధికారుల అతికాకపోతే.. రూ.యాభై వేలు కట్టినోడికి తొమ్మిది రూపాయల ముప్ఫై నాలుగు పైసలు ఎక్కువవుతుందా? చొక్కన గౌడ కూడా ఇలాగే ఫీలయ్యాడు.

 సరే అనుకుని బ్యాంకుకు వెళ్లాడు. మిగిలిన బాకీ వివరాలతో పే ఇన్‌ స్లిప్‌ నింపాడు. పది రూపాయల నోటు జత చేసి బ్యాంకు అధికారికి ఇచ్చాడు. వాళ్లేమో భలే నిక్కచ్చిగా పనిచేశాము మేము అనుకుని భుజాలు చరుచుకుని సీలు వేసిన స్లిప్‌ను చొక్కనగౌడకు రిటర్న్‌ ఇచ్చాడు. అక్కడ మొదలైంది తకరారు. ‘‘పది రూపాలిచ్చా. మీకివ్వాల్సింది రూ.9.34. ఆ విషయమే స్లిప్‌లో రాశా.

 మీరు సీల్‌ కూడా వేశారు. మరి... బాకీ 66 పైసల మాటేమిటి?’’అన్నాడు చొక్కనగౌడ. నోట మాట రాలేదు బ్యాంకు అధికారులకు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే.. చొక్కనగౌడ డిమాండ్‌కు తలొగ్గిన బ్యాంకు 66 పైసల మొత్తాన్ని అతడి ఖాతాలోకి జమ చేయడం!     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement