బనశంకరి: పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి సిలికాన్ సిటీకి నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు ఉదయమే చేరుకుంటాయి. వాటిలో నుంచి వేలాది మంది వలస కార్మికులు దిగుతారు. నగరంలో పనులు వెతుక్కుంటూ ఇక్కడే స్థిరపడిపోతున్నారు. కానీ వారిలో భారతీయులు కానివారు ఎంత మందో ఎవరికీ తెలియదు. అక్రమంగా వలస వస్తున్న బంగ్లాదేశీలతో పలు రకాలు నేరాలు పెరగడంతో బెంగళూరు పోలీసులు మేలుకున్నారు.
వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీలో
బెంగళూరు నగరంలో అక్రమంగా మకాం వేసిన బంగ్లాదేశీ వలసదారులపై నగర పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ‘ఆపరేషన్ ముక్త’ పేరుతో శనివారం 50 చోట్లకు పైగా దాడులు నిర్వహించారు. సుమారు 2 వేలమందికి పైగా బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుని వారి గుర్తింపు కార్డుల పరిశీలనతో పాటు విచారణ ప్రారంభించారు. వర్తూరు, కాడుగోడి, మారతహళ్లి, బెల్లందూరు, ఎలక్ట్రానిక్ సిటీ, బేగూరు, బండేపాళ్యతో పాటు వివిధ ప్రదేశాల్లో షెడ్లు వేసుకుని స్థిరపడిన బంగ్లావాసులపై పోలీసులు దాడిచేశారు. ఈ ప్రాంతాలు వేలాది షెడ్లతో మినీ బంగ్లాదేశ్‌లుగా మారాయని ఆరోపణలున్నాయి.
దాఖలాల తనిఖీ
వలసవాసులు ఇక్కడకు వచ్చాక తీసుకున్న ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డుతో పాటు వివిధ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఊరి, పేరు, వృత్తి వివరాలను సేకరించడంతో పాటు షెడ్లలో సోదాలు చేశారు. ఇక్కడ పురుషులు, మహిళలతో పాటు వందలాది కుటుంబాలు స్థిరపడ్డాయి. నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సూచన మేరకు బంగ్లా వలసదారులపై కార్యాచరణ జరుగుతోందని వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. 500 మందికిపైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితులను విదేశాంగ శాఖ విభాగం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ముందు హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా వలస వచ్చారని రుజువైతే వారి దేశానికి పంపించే చర్యలు తీసుకుంటామని సైదులు తెలిపారు.
బెంగళూరులో పలుచోట్ల
ముమ్మర తనిఖీలు


