నిలిచిన లారీని కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

నిలిచిన లారీని కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

యశవంతపుర: వారాంతపు టూర్‌ విషాదంగా మారింది. రోడ్డు పక్కలో నిలిపి ఉన్న గ్యాస్‌ సిలిండర్ల లోడు లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కొట్టిగేహర దగ్గర జరిగింది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాకు చెందిన గురుకిరణ్‌ (28), మోహన్‌ (30), జ్ఞానేశ్‌ (28) మృతులు. గాయాలైన ప్రేమ్‌కుమార్‌, హృతిక్‌ హాసన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీకెండ్‌ కావడంతో తుమకూరు నుంచి ధర్మస్థళకు కారులో బయల్దేరారు. వేగం వల్ల అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన నిలిచి ఉన్న సిలిండర్ల లారీని ఢీకొనడంతో తుక్కయింది.

బిర్యానీ గొడవ.. హోటల్‌పై దాడి

యశవంతపుర: బెంగళూరులో పుట్టగొడుగుల బిర్యానీలోకి నంజుకోవడానికి చట్నీ ఇవ్వలేదనే కోపంతో హోటల్‌ యజమానిపై కస్టమర్లు దాడి చేసి క్యాష్‌ కౌంటర్‌, టెంట్‌ను ధ్వంసం చేశారు. నాగరబావి సువర్ణ లేఔట్‌లో ఈ ఘటన జరిగింది. అప్పు మష్రూం బిర్యానీ హోటల్‌కు వెళ్లిన ఇద్దరు బిర్యానీ ఆర్డర్‌ చేశారు. బిర్యానీలోకి చట్నీ ఇవ్వలేదని, వట్టి బిర్యానీ ఎలా తినాలంటూ గొడవకు దిగారు. కోపం పట్టలేక క్యాష్‌ కౌంటర్‌, టెంట్‌ను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేశారు. హోటల్‌ యజమాని అన్నఫూర్ణేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం ఈ గొడవ జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కూలిన సర్కారీ బడి ప్రహరీ

నాలుగేళ్ల పాప మృతి

కొడగు జిల్లాలో ప్రమాదం

యశవంతపుర: పాఠశాల కాంపౌండ్‌ కూలిపడి నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. ఈ విషాదం కొడగు జిల్లా మడికెరి దగ్గర కుశాలనగర బసవనహళ్లిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం వాల్మీకి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న అక్కను తీసుకురావడానికి అపూర్వ (4) పాఠశాల వద్దకు వెళ్లింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షంతో పాఠశాల ప్రహరీ బలహీనంగా ఉంది. ఒక్కసారిగా గేటు, కాంపౌడ్‌ కూలి చిన్నారిపై పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలిక అక్కడే ప్రాణాలు వదిలింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే తమ పాపను బలిగొందని తల్లిదండ్రులు ఆరోపించారు. పెద్దసంఖ్యలో స్థానికులు చేరి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పాఠశాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. పరిహారం చెల్లించాలని కుటుంబీకులు పట్టబట్టారు.

మైసూరువాసిపై

లడఖ్‌లో ఫిర్యాదు

మైసూరు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై మైసూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక నివాసి ఫిర్యాదు చేశారు. మైసూరులోని దేవరాజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే వ్యక్తి అమిత్‌ షాపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారని లడఖ్‌కు చెందిన పైరింగ్‌ ముత్తాఫ్‌ అనే వ్యక్తి అక్కడి లేహ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు కేసును మైసూరు దేవరాజ్‌ ఠాణాకు బదిలీ చేశారు. ప్రాథమిక విచారణలో, నిందితుడు బృందావన్‌ బరంగాయ్‌కు చెందిన యోగిష్‌ అని తేలగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement