బస్సులు రాకుంటే, చదివేదెలా? | - | Sakshi
Sakshi News home page

బస్సులు రాకుంటే, చదివేదెలా?

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకా హొసూరు గ్రామానికి కేఎస్‌ఆర్టీసీ బస్సు సమయానికి రావడం లేదు, బస్సు డ్రైవర్‌, కండక్టర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని హొసూరు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు శిరా కేఎస్‌ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ తావరకెరె గ్రామానికి బూతప్పనగుడి, కళువరహళ్లి, రంగనహళ్లి, గోమారదనహళ్లి, హొసహళ్లి, పురలెహళ్లి, హొసూరుతో పాటు వివిధ గ్రామాల నుంచి రావడానికి సమయానికి బస్సులు లేవని వాపోయారు. రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు, సరిగా చదువుకోలేకపోతున్నామని చెప్పారు. ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సులను సకాలంలో నడపాలని కోరారు.

స్కూటర్‌ను సిటీ బస్సు ఢీ, యువతి బలి

మైసూరు: మైసూరులో కేఎస్‌ఆర్టీసీ బస్సు– స్కూటర్‌ను ఢీకొనడంతో ఒక విద్యార్థిని మరణించింది. మైసూరు, శ్రీరాంపుర నివాసి గోవిందు కుమార్తె కీర్తన (19) అనే బీసీఏ విద్యార్థిని మరణించగా, మరో యువతికి గాయాలయ్యాయి. కీర్తన, స్నేహితురాలు హర్షిణితో కలిసి నగరంలోని పంచమాత్ర రోడ్డుపై స్కూటర్‌పై వెళ్తోంది. జ్ఞానగంగ స్కూల్‌ జంక్షన్‌ వద్ద సిటీ బస్‌ను ఓవర్‌టేక్‌ చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో, బస్సు స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులూ కింద పడిపోయారు, బస్సు ముందు చక్రం కీర్తనపై నుంచి దూసుకెళ్లింది. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, కొంతసేపటికే కీర్తన చనిపోయింది. కువెంపునగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నగరంలో సిటీ, ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

బోనులో చిరుత బందీ

తుమకూరు: జిల్లాలోని తురువెకెరె తాలూకా చిమ్మనహళ్లి గ్రామంలోని శ్రీమునేశ్వర స్వామి దాసోహ మఠం వద్ద బోనులో ఆడ చిరుత చిక్కింది. వారం రోజులుగా కొండజ్జి, చిమ్మనహళ్లి, దొడ్డగోరాఘట్ట ప్రాంతాల్లో మూడు నాలుగు చిరుతలు తిరుగుతూ ఉండడంతో ప్రజల్లో భయం నెలకొంది. చిమ్మనహళ్లి మునేశ్వర దేవస్థానం వెనుక ఓ చిరుత తిరుగుతోంది. అక్కడ అటవీ సిబ్బంది బోనులు పెట్టగా, రెండున్నరేళ్ల వయస్సుగల ఆడ చిరుత బందీ అయింది. ఇంకా 2–3 చిరుతలు ఈ ప్రాంతంలో ఉన్నాయని, వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. పట్టుబడిన చిరుతను దూరంగా తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement