గుజరాత్‌ అలల బావి మిస్టరీ వీడింది..! | Ocean-Like Waves in Gujarat's Morbi Well: Scientific Reason Explained | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ అలల బావి మిస్టరీ వీడింది..!

Aug 8 2026 11:13 AM | Updated on Aug 8 2026 11:30 AM

Ocean Like Waves in a Well: Gujarat Morbi Strange Phenomenon Explained

సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిచింది. సముద్రపు అలలను తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూ కనిపిస్తోంది. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక.. దీని వెనక కారణం ఏంటన్నది తెలిసిపోయింది!. 

విర్పర్డా గ్రామంలోని ఈ వింత బావి గురించి కొన్నిరోజులుగా దేశం చర్చించుకుంది. సోషల్‌ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. అతీత శక్తులంటూ.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్‌ తప్ప మరేయితర కారణాలు లేవని నిపుణులు తేల్చేశారు. అంతేకాదు.. ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోవని అంటున్నారు. ఈ తరహా అలలు ఏర్పడడానికి సరైన కారణం ఏంటన్నది చెబుతున్నారు. 

సముద్రంలా ఎందుకు ఊగుతోందంటే..
భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఈ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు, ఖాళీ ప్రదేశాలు, జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో భూమి లోపల ఉన్న గాలి, నీటి ఒత్తిడిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలోని నీరు పైకి కిందికి కదులుతూ అలల మాదిరిగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోతైన బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

‘వెల్‌ సీష్‌’ కూడా ఓ కారణమేనా?
ఈ ఘటనకు మరో శాస్త్రీయ వివరణగా ‘వెల్‌ సీష్‌’ (Well Seiche). ఒక నిర్దిష్ట ఆకారం, లోతు కలిగిన నీటి నిల్వలో చిన్నపాటి కదలిక కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు.. నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతుంది. సరస్సుల్లో కనిపించే ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

భూకంపం భయం..
మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండటంతో ఈ బావిలోని వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్‌ను కుదిపేసిన భారీ భూకంపం జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్న నీటి కదలికలకు భూకంప కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు, భూగర్భ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్‌ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్‌ లైన్‌ గుర్తించలేదని తేల్చేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సముద్రపు ఆటుపోట్ల ప్రభావమా?
మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూర ప్రాంతం కాదు. దీంతో కొందరు స్థానికులు బావి నీరు సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతోందని భావించారు. భూగర్భ జల మార్గాలు సముద్రంతో అనుసంధానమై ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

ఇలాంటి వింతలు ప్రపంచంలోనూ ఉన్నాయి
బావులు, సరస్సుల్లో నీరు అసాధారణంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. సరస్సుల్లో నీరు ఒకే దిశలో ఊగడం, భూగర్భ జలాల్లో ఒత్తిడి మార్పులతో నీటి స్థాయిలు మారడం వంటి పరిణామాలను శాస్త్రవేత్తలు సహజ ప్రక్రియలుగానే వివరిస్తున్నారు. అయితే బావిలో నీరు కదలడం ఆధారంగా భూకంపాలను అంచనా వేయడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మన దేశంలో ఇలాంటివి జరిగినా.. ఇప్పుడు సోషల్‌ మీడియా జమానా కారణంగా మోర్బీ బావి ఉదంతం హైలైట్‌ అయ్యిందంతే!.

భయపెట్టిన బావి.. ఇప్పుడు ఆకర్షణగా మారింది
మొదట ఈ దృశ్యం గ్రామస్తులను భయపెట్టినా.. ఇప్పుడు అదే బావి ఆసక్తికరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వింతను చూసేందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. గుజరాత్‌ మోర్బీ బావిలో కనిపిస్తున్న ఈ ‘సముద్రపు అలలు’ భూమి లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే సంకేతం కాదు.. ప్రకృతి తనదైన రీతిలో చూపిస్తున్న అరుదైన జల భౌగోళిక పరిణామం మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement