కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.
మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.
బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.


