పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు! | Panchkula Shocker: CCTV Captures Maid’s Chilling Act | Sakshi
Sakshi News home page

పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!

Aug 7 2026 8:32 AM | Updated on Aug 7 2026 8:38 AM

Panchkula Shocker: CCTV Captures Maid’s Chilling Act

ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇంట్లో నగలు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి ఆరా తీసేందుకు వెళ్లిన ఇంటి పెద్ద మహిళ తిరిగి రాలేదు. గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఊహించని షాక్‌ ఎదురైంది. అదృశ్యమైన మహిళ ఇంటి సమీపంలోని పైకప్పుపై చెట్టు కింద శవమై కనిపించింది. ఆ తర్వాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసులో కీలక మలుపుగా మారాయి.

హర్యానాలోని పంచకుల సెక్టార్‌-21లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్‌ మన్మోహన్‌ లాల్‌ మెహతా భార్య నీరా మెహతా (72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మెహతా ఇంట్లో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి. వాటి గురించి తెలుసుకునేందుకు నీరా మెహతా ఇంట్లో పనిచేసే సునీతా దేవి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఘర్షణకు దారితీసి ఉండొచ్చని, ఆ సమయంలోనే నీరా మెహతా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ ఆధారాల ద్వారా తేలనున్నాయి.

ఇంటి పక్కనే దాచిన మృతదేహం
భర్త ఫిర్యాదుతో నీరా మెహతా అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునీతా దేవి ఇంటికి వెళ్లగా.. ఆ ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. అనంతరం పక్కింటి పైకప్పు నుంచి పరిశీలించగా.. చెట్టు కింద కప్పి ఉంచిన స్థితిలో నీరా మెహతా మృతదేహం కనిపించింది. వెంటనే ఫోరెన్సిక్‌ బృందాన్ని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.

సీసీటీవీలో షాకింగ్‌ దృశ్యాలు
ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. సునీతా దేవి, ఆమె కుమారుడు రాజా కలిసి మృతదేహాన్ని తరలించి పక్కింటి పైకప్పుపై దాచేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించిన కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముగ్గురి అరెస్టు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సునీతా దేవి, ఆమె భర్త శంకర్‌, కుమారుడు రాజాలను అరెస్టు చేశారు. హత్య, ఆధారాల ధ్వంసం, దొంగతనం, ఉమ్మడి ఉద్దేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులు మాత్రం నగల దొంగతనం ఆరోపణలను ఖండించినట్లు పోలీసులు తెలిపారు. సునీతా దేవి కన్‌ఫెషన్‌ రిపోర్ట్‌లో.. నీరా మెహతా ప్రమాదవశాత్తు జారి పడిపోయారని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్‌ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా నివసించే వృద్ధులు ఇంట్లో పనిచేసే సిబ్బంది వివరాలను పోలీసులతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన పనిమనుషుల బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement