ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..
ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7
— Daily Bollywood (@Bollywooz) August 6, 2026
ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


