‘‘ఎప్పటి నుంచో ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలని ఉండేది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశాను. నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా, సత్య కీలక పాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు.
⇒ నేను ఏ కథ విన్నా థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులోని ఎంటర్‌టైన్‌మెంట్ నాకు చాలా నచ్చింది. నటుడిగా వెవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అబీప్రాయం ఉంది... అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే చాన్స్ రావడం సంతోషంగా అనిపించింది. ఈ పాత్ర నటుడిగా చాలా తృప్తినిచ్చింది.
⇒ గాంధీ పాత్ర రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఆ యాసపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. మరో పాత్ర కోసం కొరియన్ భాష నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పాత్రలో నేను కనిపించకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఈ సినిమాలో నాది, సత్య పాత్ర చాలా కీలకం. మేమిద్దరం రాయలసీమ యాస నేర్చుకుని, వర్క్ చేశాం.
⇒ రాజీవ్‌గారు, వంశీగారు చాలా ప్యాషన్ ఉన్న ప్రోడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. ఇక పర్సనల్‌గా మాకు అబ్బాయి పుట్టిన తర్వాత షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాను. నేను నటించనున్న ‘బరి’ సినిమా ప్రీ- ప్రోడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథ ఉంటుంది.


