నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ: పార్ట్-1' ట్రైలర్ అన్ని భాషలు, డిజిటల్ వేదికలు కలిపి 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ట్రైలర్ ఈ ఘనత సాధించలేదు. హిందీ ట్రైలర్ ఒక్కటే 'వరల్డ్ ఆఫ్ రామాయణ' ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 588 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర వేదికల్లో కూడా భారీ స్పందన లభించింది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాన్స్ జిమ్మర్–ఏ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రబృందం ఇంగ్లిష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఐ ఆధారిత సరికొత్త లిప్-సింక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వెర్షన్‌ను రూపొందించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ విడుదల చేయనుండటం విశేషం.


