‘‘ఒక పార్టీలో లోకేష్ కనగరాజ్‌గారిని కలిశాను. మనిద్దరం కలిసి పని చేస్తే బాగుంటుందని చెప్పాను. ‘డీసీ’ చిత్రకథ ఆయనకు చాలా నచ్చడంతో హీరోగా నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు. భారతీరాజా, సెల్వరాఘవన్, ధనుష్... వంటి వార్లను నేను డైరెక్ట్ చేశాను. దర్శకులతో పని చేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ విజన్‌ని త్వరగా అర్థం చేసుకుంటారు’’ అని అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ మాథేశ్వరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డీసీ’ ఒక వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ. దేవదాస్ తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు.
ఆ తర్వాత వీరి జర్నీ ఎలా సాగుతుంది? అనేది ఈ సినిమా. దేవదాస్ అంటే అందరికీ క్లాసిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అదే పాత్రలను గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను. లోకేష్ కనగరాజ్ అద్భుతంగా నటించారు. వామికా గబ్బి సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తారు. దేవదాస్‌ను కలిశాక ఆమె జీవితం ఎలా మారుతుంది? అనేదే ఆమె పాత్ర ప్రయాణం. ఇళయరాజాగారి బయోపిక్ భవిష్యత్తులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


