క్లైమాక్స్‌ హృదయాన్ని హత్తుకుంటుంది: నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ | Husharu Pittalu Movie Song Launch: Producer Bekkam Venu Gopal Speech at Hushar Pittalu Movie | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ హృదయాన్ని హత్తుకుంటుంది: నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌

Aug 7 2026 12:19 AM | Updated on Aug 7 2026 12:19 AM

Husharu Pittalu Movie Song Launch: Producer Bekkam Venu Gopal Speech at Hushar Pittalu Movie

బిక్షు, బెక్కెం వేణుగోపాల్, వాసవి, అన్షు, వెంకట్‌

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌పై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సమావేశంలో ‘టోంగా టోంగా’, ‘ శుక్రవారం నాడు సక్కని గడియ’ పాటలను రిలీజ్‌ చేశారు.

అనంతరం హీరో అన్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా విషయంలో మాకు అంతా పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిని కావాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. ఈ నెల 10న మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నాం. ట్రైలర్‌ చూసిన తర్వాత మా సినిమాపై ఉన్న అబీప్రాయాలు మారిపోతాయి’’ అని చెప్పారు. ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు ప్రశంసలు వచ్చాయి... విమర్శలూ వచ్చాయి. కానీ టీజర్‌ వైరల్‌ అయ్యి, హిట్‌ అయ్యింది. ప్రేక్షకులు మా సినిమాను చూస్తే, వారి డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారని చెప్పగలను’’ అన్నారు వెంకట్‌ యాదవ్‌.

‘‘ఈ సినిమా కేవలం యూత్‌కే    కాదు... మంచి సందేశం ఉన్న కమర్షియల్‌ చిత్రం. నిర్మాత సురేష్‌బాబుగారు చూసి, నచ్చి, ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. క్లైమాక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి’’ అని చెప్పారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. ‘‘హిట్‌ సినిమా లేకపోతే ఇండస్ట్రీ గుర్తించదు. నాకు ఈ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ వస్తుందని అనుకుంటున్నాను’’ అని తెలిపారు సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌. వాసవి గణేషన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement