తమిళనాట ఉప ఎన్నికల హీట్‌.. సీఎం విజయ్‌ బిగ్‌ డెసిషన్‌ | CM Vijay to meet TVK booth workers Ahead of Tamil Nadu bypoll | Sakshi
Sakshi News home page

తమిళనాట ఉప ఎన్నికల హీట్‌.. సీఎం విజయ్‌ బిగ్‌ డెసిషన్‌

Sep 25 2026 8:58 AM | Updated on Sep 25 2026 8:58 AM

CM Vijay to meet TVK booth workers Ahead of Tamil Nadu bypoll

తమిళనాట ఉప ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుతోంది. అక్టోబర్‌ 6న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్న వేళ.. సీఎం, టీవీకే అధినేత విజయ్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారాన్ని బూత్‌ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన విజయ్‌.. శుక్రవారం మదురాంతకంలో పార్టీ బూత్‌ స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో క్షేత్రస్థాయి ప్రచారం, ఓటర్లను కలిసే విధానం, స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, ఉపఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే అధినేత, సీఎం విజయ్‌కు ఇవే తొలి ఉపఎన్నికలు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు డీఎంకే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగగా.. అన్నాడీఎంకే తనకు చేజారిన రెండు సీట్లను తిరిగి దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. మదురాంతకం నుంచి టీవీకే తరఫున కే. మరగతం కుమారవేల్‌, ధారాపురం నుంచి పి. సత్యబామను బరిలోకి దించింది. వీరిద్దరూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఆ రాజీనామాల కారణంగానే ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు అదే నియోజకవర్గాల నుంచి టీవీకే అభ్యర్థులుగా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక టీవీకేకు కీలక రాజకీయ సందర్భంగా మారింది. అక్టోబర్‌ 6న మదురాంతకంతో పాటు ధారాపురంలోనూ ఉపఎన్నిక జరగనుంది.

ఇక, బూత్‌ ఏజెంట్ల సమావేశంలో మంత్రి ఎన్‌. ఆనంద్‌, మంత్రి ఆదవ్‌ అర్జున్‌ కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రోడ్లు, తాగునీరు వంటి ప్రాథమిక సమస్యలను గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని ఆనంద్‌ సూచించారు. అవసరాలను తెలుసుకునేందుకు మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో రెండు, మూడు రోజులపాటు ఎమ్మెల్యేలతో కలిసి ఉండి.. ప్రత్యేకంగా ఫిర్యాదులను పరిష్కరించనున్నారు.

డీఎంకే నుంచి గట్టి పోటీ..
టీవీకేకు పోటీగా డీఎంకే కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మదురాంతకం నుంచి ఐ. పరంధామన్‌, ధారాపురం నుంచి ఎస్‌. సుగన్యను బరిలోకి దించింది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ టీవీకే, డీఎంకే మధ్య నేరుగా పోటీ నెలకొంది.

అన్నాడీఎంకేకు మరో లెక్క..
ఇక ఈ రెండు సీట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుచుకున్నవే. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కోల్పోయిన స్థానాలను తిరిగి సాధించడంపై అన్నాడీఎంకే ఫోకస్‌ పెట్టింది. మదురాంతకంలో ఎస్‌. కనితా సంపత్‌, ధారాపురంలో కే. బానుమతిని అభ్యర్థులుగా నిలబెట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

అసలు పోరు ఇక్కడే..
ఈ రెండు ఉపఎన్నికల్లో మూడు పార్టీలకు మూడు వేర్వేరు రాజకీయ లెక్కలు ఉన్నాయి. టీవీకేకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ప్రజా స్పందనను ఎన్నికల ద్వారా ఎదుర్కొనే అవకాశం ఉండగా.. డీఎంకే తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు బరిలో ఉంది. అన్నాడీఎంకే మాత్రం తన నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకే తరఫున పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తిరిగి పోటీ చేస్తోంది. ఇదే అంశం ప్రచారంలో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఇక, మదురాంతకం, ధారాపురం రెండూ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు. అక్టోబర్‌ 6న పోలింగ్‌, అక్టోబర్‌ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఇదీ చదవండి: తమిళనాడు ఎప్‌స్టీన్‌ కేసులో కీలక పరిణామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement