తమిళనాడులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్.వీరమణిపై నమోదైన పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ‘తమిళనాడు ఎప్‌స్టీన్ కేసు’గా చర్చనీయాంశమైంది. బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలతో వీరమణి, ఆయన సహచరులు అరెస్టు కాగా.. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసుల పాత్రపైనా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కేసుకు కేంద్రంగా ఉన్న వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ తాజాగా బయటపెట్టడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
వీరమణి(84)పై ఆరోపణలకు కీలక ఆధారంగా పేర్కొంటున్న వీడియోను జాతీయ మీడియా సంస్థ యాక్సెస్ చేసి ప్రసారం చేసింది. అందులో ఓ బాలికతో ఆయన ఉన్నట్లు దృశ్యాలు చూపించింది. ఈ వీడియోను 2025 అక్టోబర్‌లోనే ఓ కాంగ్రెస్ నేత పోలీసులకు అందించినట్లు వెల్లడించింది. అయితే ఆ సమయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు వీడియో స్పష్టత, ప్రామాణికతపై డీఎంకే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో అప్పటి దర్యాప్తులో ఏం జరిగింది? పోలీసులకు ఆధారాలు అందినప్పటికీ కేసు ఎందుకు ముందుకు సాగలేదు? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
పెన్‌డ్రైవ్‌తో మొదలై.. క్లోజర్ రిపోర్ట్ వరకు
2025 అక్టోబర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థకు గుర్తుతెలియని వ్యక్తి పెన్‌డ్రైవ్, లేఖ అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఓ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉందని పేర్కొంటూ వీరమణి పేరు ప్రస్తావించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సుమారు ఐదు నెలల విచారణ అనంతరం పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. వీడియోలో కనిపిస్తున్న బాలికను గుర్తించలేకపోవడం, ఒరిజినల్ వీడియో లభించకపోవడం, తగిన ఆధారాలు లేకపోవడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. అయితే ప్రత్యేక పోక్సో కోర్టు ఈ క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో కేసులో కీలక మలుపు
కోర్టు ఆదేశాల తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. వీడియోలో కనిపించిన బాలికను పోలీసులు గుర్తించి.. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు విస్తరించడంతో మరికొందరు బాధితులు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురికి పైగా బాధితులను గుర్తించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో వీరమణితో పాటు శాంతి, మహేంద్ర సిమ్హన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో మాజీ ఉద్యోగి గణేశన్‌ను కూడా డిజిటల్ ఆధారాల వ్యవహారంలో అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా నివేదించింది.
పాత దర్యాప్తుపైనే ఇప్పుడు ఫోకస్
కేసు ఇక్కడితో ఆగలేదు. తొలుత దర్యాప్తు చేసిన పోలీసు అధికారుల వ్యవహారంపైనా అధికారులు దృష్టి పెట్టారు. అప్పట్లో కేసును ఎందుకు మూసివేయాలని నిర్ణయించారు? ఆధారాలు అందుబాటులో ఉన్నప్పటికీ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగలేదు? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. పాత దర్యాప్తులో వ్యవహరించిన సీనియర్ పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అదే సమయంలో వీరమణికి సంబంధించిన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
విజయ్ సర్కార్ చర్యలు
కేసు తీవ్రత పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించింది. గత దర్యాప్తులో ఎవరైనా నిర్లక్ష్యం వహించారా? కేసును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందా? అన్న కోణాల్లోనూ విచారణ సాగుతోంది. పోలీసు వ్యవస్థలోని అధికారుల పాత్రపై కూడా సమీక్ష మొదలైంది. దీంతో ఈ కేసు కేవలం నిందితులపై దర్యాప్తుకే పరిమితం కాకుండా.. గతంలో కేసును హ్యాండిల్ చేసిన తీరుపైనా విచారణ జరుగుతున్న వ్యవహారంగా మారింది.
విజయ్ సర్కార్‌పై స్టాలిన్ రిప్లై
ఇదిలా ఉండగా.. కేసును అడ్డుకున్నారంటూ గత డీఎంకే ప్రభుత్వంపై టీవీకే వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం మొదలైంది. వీరమణిని కాపాడాలని తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తనపై, తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అసత్యం, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. బాలికలకు న్యాయం జరగడమే ఈ వ్యవహారంలో అందరి ప్రధాన లక్ష్యం కావాలని స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో వీరమణి కేసు ఇప్పుడు క్రిమినల్ దర్యాప్తుతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారింది.
అసలు ప్రశ్నలివే..
ఇప్పుడు ఈ కేసులో అసలు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. పోలీసులకు వీడియో ఎప్పుడు చేరింది? ఆధారాలు ఉన్నప్పటికీ తొలి దర్యాప్తు క్లోజర్ రిపోర్టు వరకు ఎందుకు వెళ్లింది? కోర్టు ఆదేశాల తర్వాతే బాధితులను గుర్తించే దిశగా దర్యాప్తు ఎలా ముందుకు సాగింది? ఈ అంశాలపై విజయ్ సర్కార్ దృష్టి సారించడంతో పాత దర్యాప్తు తీరుపైనా విచారణ జరుగుతోంది. మరోవైపు వీరమణిని కాపాడారన్న ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తూ.. తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో నిందితులపై కేసు దర్యాప్తుతో పాటు.. గతంలో ఈ వ్యవహారాన్ని పోలీసులు ఎలా నిర్వహించారన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.
ఇదీ చదవండి: విద్యార్థుల మెనూలోకి బీఫ్


