నా భర్తను తప్పుడు కేసులతో  జైల్లో పెట్టించారు  | Arpita Pradhan accused bengal cm Suvendu Adhikari | Sakshi
Sakshi News home page

నా భర్తను తప్పుడు కేసులతో  జైల్లో పెట్టించారు 

Sep 25 2026 6:16 AM | Updated on Sep 25 2026 6:16 AM

Arpita Pradhan accused bengal cm Suvendu Adhikari

సీఎం సువేందు అధికార దుర్వినియోగం 

నందిగ్రామ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌ భార్య ఆరోపణ 

కుమార్తెతో కలిసి భర్త తరఫున ప్రచారం చేస్తానని వెల్లడి 

కోల్‌కతా: బెంగాల్‌ సీఎం సువేందు అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తప్పుడు కేసులతో తన భర్తను జైలులో పెట్టించారని నందిగ్రామ్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌ భార్య అర్పిత ఆరోపించారు. గురువారం ఆమె కోల్‌కతాలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు 20 ఏళ్లనాటి పాత కేసులో సరిగ్గా ఉప ఎన్నికకు ముందు అరెస్ట్‌ చేయడమేంటని పోలీసులను ఆమె ప్రశ్నించారు. 

ఆ కేసులో సీఎం అధికారి పేరు కూడా ఉందని, ఆయన్నెందుకు వదిలేశారంటూ నిలదీశారు. అసలైన దోషి సువేందు అధికారి సీఎం పదవిలో ఉన్నందునే స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. తన కుమార్తెతో కలిసి నందిగ్రామ్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి మిలన్‌ ప్రధాన్‌ తరఫున ప్రచారం చేపడతానని అరి్పత వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితుల కారణంగా తమ కుమార్తె స్కూలుకు కూడా వెళ్లలేకపోతోందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛ అనేది కనిపించడం లేదని, మనం ఇప్పటికీ బ్రిటిష్‌ పాలనలో ఉన్నట్లే కనిపిస్తోందన్నారు. జైలులో ఉన్న అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీపై జరుగుతున్న పోరాటంలో తమతో చేతులు కలపాలని ఆమె అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.  

మిలన్‌ను పోటీ చేయనివ్వాలి: కలకత్తా హైకోర్టు ధర్మాసనాలు 
మిలన్‌ ప్రధాన్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టులోని రెండు ధర్మాసనాలు నందిగ్రామ్‌ ఉప ఎన్నికలో మిలన్‌ను పోటీ చేయనివ్వాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాయి. తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిలివ్వాలంటూ మిలన్‌ పెట్టుకున్న అర్జీని జస్టిస్‌ తీర్థంకర్‌ ఘోష్, జస్టిస్‌ సౌగతా భట్టాచార్య సారథ్యంలోని రెండు ధర్మాసనాలు విచారించి పైవిధంగా అభిప్రాయం తెలిపాయి. మిలన్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం జరిగే విచారణ సమయానికి అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. నందిగ్రామ్‌ ఉప ఎన్నిక ప్రచారం అక్టోబర్‌ 4వ తేదీతో ముగియనుండగా పోలింగ్‌ 6వ తేదీన జరగనుంది. దిగువ కోర్టు మిలన్‌ ప్రధాన్‌కు అక్టోబర్‌ 7వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను అనుమతించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement