కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఇదే చివరి అవకాశమంటూ హెచ్చరిక
సోషల్ మీడియా వేదికల ఉల్లంఘనలపై ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నారుల లైంగిక దోపిడీ, అశ్లీల చిత్రాల (సీఎస్‌ఈఏఎం) కట్టడికి తీసుకున్న చర్యలను తెలపాలంటూ సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని కూడా కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, న్యాయ శాఖలకు ఆగస్ట్ 14న నోటీసులిచ్చినా ఇప్పటికీ అఫిడవిట్ వేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ (జేఆర్‌సీఏ) వేసిన పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారించింది. సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను నిరోధించడంలో, అధికారులకు నివేదించడంలో విఫలమైన సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జేఆర్‌సీఏ కోరింది.
చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సోషల్ మీడియా వేదికలు ఏమాత్రం పాటించడం లేదని జేఆర్‌సీఏ పేర్కొంది. వాదనల సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కేఎం నటరాజ్ స్పందిస్తూ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వివరించారు. ఇప్పటికే ఒక కంపెనీకి నోటీసులు జారీ చేసి, చర్యలు ప్రారంభించినట్లు నివేదించారు.
2024నాటి తీర్పులో ఏముంది?
2024 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల కంటెంట్ కనిపిస్తే కచ్చితంగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అయితే ఆ నిబంధనలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని జేఆర్‌సీఏ పేర్కొంది.
బీబీసీ కథనం చెప్పిందిదే..
ఇన్‌స్టా గ్రామ్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించిన పెయిడ్ ప్రకటనలు వస్తున్నాయని, వాటి ద్వారా టెలిగ్రామ్ ఛానళ్లకు వినియోగదారులను మళ్లించి అశ్లీల చిత్రాలను విక్రయిస్తున్నారని ఇటీవల బీబీసీలో ఒక కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై బీబీసీకి మెటా సంస్థ ప్రతినిధులు బదులిస్తూ.. అటువంటి కంటెంట్ కనిపిస్తే అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)కి రిపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే పోక్సో చట్టం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతీయ స్థానిక పోలీసులకు లేదా స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్‌కు ఫిర్యాదు చేసినట్లు బీబీసీ కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని పిటిషన్‌లో ప్రధానంగా లేవనెత్తారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.


