ఎల్‌నినో, వర్షాభావం నేపథ్యంలో కేంద్రం కసరత్తు
నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళికపై రాష్ట్రాలకు సూచనలు
పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచాలని హితవు
సాక్షి, న్యూఢిల్లీ: రబీ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ముమ్మరం చేసింది. వర్షపాతం లోటు, ప్రాంతాలవారీగా అసమాన వర్షాలు, నేలలో తేమ, జలాశయాల్లో నీటి నిల్వలు, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటల ప్రణాళికపై దృష్టి సారించింది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ విత్తనాలు, ఎరువుల లభ్యతను ముందుగానే నిర్ధారించడంతోపాటు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
తక్కువ నీటితో సాగయ్యే వాటిపై దృష్టిపెట్టండి..
రబీ పంటల సాగు అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి లభ్యత, పంటల సాగు, విస్తీర్ణంపై రాష్ట్రాల వారీగా ప్రణాళిక అవసరమని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నీటి కొరత ఉండే ప్రాంతాల్లో అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రబీకి ముందే జలాశయాల్లోని నీటి నిల్వలను అంచనా వేయాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు చేసింది.
వర్షాధార ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని కృషి విజ్ఞాన కేంద్రాలకు మోదీ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న చోట తక్కువ నీటి అవసరమయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సాగునీటి ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే రాష్ట్రాలతో రబీ సన్నాహాలపై చర్చలు జరిపి, ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
గత ఏడాది రబీలో 6.37 కోట్ల హెక్టార్లలో పంటల సాగు జరిగింది. ఈసారి 35 లక్షల నుంచి 45లక్షల హెక్టార్ల మేర సాగు తగ్గవచ్చని అంచనా వేస్తోంది. రబీ సీజన్‌లో శనగ, కంది వంటి పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. గత ఏడాది పప్పుధాన్యాల సాగు 1.33 కోట్ల హెక్టార్లలో జరిగింది. ఈ ఏడాది అది 1.50కోట్ల హెక్టార్లకు పెంచాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నూనె గింజల సాగును 94 లక్షల హెక్టార్ల నుంచి కోటి ఎకరాలకు పెంచేలా ప్రయత్నాలు చేస్తోంది. దేశీయంగా వీటి ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతోపాటు మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్రాలతో ఒకసారి కేంద్రం సమీక్ష నిర్వహించింది. రబీ ప్రారంభం నాటికి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జిల్లాలవారీగా విత్తన అవసరాలను ముందుగానే అంచనా వేసి సరఫరా చేయాలని సూచనలు చేసింది. యూరియా, డీఏపీ, ఎన్‌పీకే తదితర ఎరువులకు డిమాండ్ పెరగనున్న దృష్ట్యా సీజన్ ప్రారంభంలోనే కొరత ఏర్పడకుండా రాష్ట్రాల అవసరాలను ముందుగానే అంచనా వేసి సరఫరా చేయడంపై కేంద్రం దృష్టిసారించింది.


