మీ నూనె మా నూనె!! | ICMR study on cooking oils used in different parts of the country | Sakshi
Sakshi News home page

మీ నూనె మా నూనె!!

Sep 24 2026 5:52 AM | Updated on Sep 24 2026 5:52 AM

ICMR study on cooking oils used in different parts of the country

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడే వంట నూనెలపై ఐసీఎంఆర్‌ అధ్యయనం 

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిపై పరిశోధన 

వంటకు కొబ్బరి నూనె, నెయ్యి వాడే వారిలో అధిక ఎల్‌డీఎల్‌ ముప్పు 

ఎంత వాడుతున్నాం.. ఏది వాడుతున్నాం ముఖ్యమంటున్న వైద్య నిపుణులు 

(సాక్షి సెంట్రల్‌ డెస్క్) : ప్రతి ఉదయం.. అనకాపల్లి నుంచి అమృత్‌సర్‌ దాకా.. ప్రతి వంటిల్లు వేపుళ్లు, పోపులతో ఘుమఘుమలాడుతుంది. సాయంత్రమైతే బజ్జీలతో కళకళలాడుతుంది. ప్రాంతాన్ని బట్టి.. అభి‘రుచులు’మారతాయి. అలాగే వాడే నూనె కూడా మారుతుంది. ప్రస్తుతం కొలెస్ట్రాల్  , మధుమేహం, గుండెపోట్లు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడే నూనెలపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఓ అధ్యయనం నిర్వహించింది. 

ఇందులో భాగంగా పరిశోధకులు 18 వేల మందిని ప్రశ్నించారు. వారి ఆహార అలవాట్లను పరిశీలించారు. అనంతరం రూపొందించిన అధ్యయన వివరాలను తాజాగా అమెరికా హార్ట్‌ అసోసియేషన్‌ సెమినార్‌లో సమర్పించారు. దీని ప్రకారం మన దేశంలో వంట నిమిత్తం నెయ్యి, కొబ్బరి నూనె ఉపయోగించే వారిలో గుండెకు హాని చేసే ఎల్‌డీఎల్‌(లో–డెన్సిటీ లిపోప్రొటీన్‌) కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేరుశనగ నూనెతో పోలిస్తే వీటిని ప్రధానంగా ఉపయోగించే వారిలో అధిక ఎల్‌డీఎల్‌ ముప్పు 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.  

రేషన్‌ షాపుల్లో పామాయిల్‌కు బదులుగా..  
ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు చాలా ప్రాధాన్యత కలిగినవని మద్రాస్‌ డయాబెటిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ఎండీఆర్‌ఎఫ్‌)కు చెందిన డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ అంజనా మోహన్‌ చెప్పారు. ఎండీఆర్‌ఎఫ్‌ కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకుంది. ‘‘రేషన్‌ షాపుల్లో పామాయిల్‌కు బదులుగా వేరుశనగ నూనెను సరఫరా చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం. ఇది ధర ఎక్కువగా ఉండొచ్చు. కానీ దీని వల్ల గుండె స్టెంట్‌లు, బైపాస్‌ సర్జరీలపై పెట్టే ఖర్చు తగ్గుతుంది’’అని డాక్టర్‌ మోహన్‌ పేర్కొన్నారు. అలాగనీ.. మనం అన్నీ మానేసుకుని కూర్చోవాల్సిన పనిలేదని.. కానీ ఎంత వాడుతున్నాం.. ఏది వాడుతున్నాం అన్న విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమని చెప్పారు. 

» అధిక ఎల్‌డీఎల్‌ కొలె్రస్టాల్‌ ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్‌ వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది.  

మనం ఎంత నూనె తీసుకోవాలి? ఎంత తీసుకుంటున్నాం? 
సిఫార్సు:  రోజుకు 27 గ్రాముల కొవ్వులు, వంట నూనెలు
పట్టణాల్లో: రోజుకు 29.5 గ్రాములు. అంటే.. ఏడాదికి సుమారు 11 కిలోలు
గ్రామాల్లో: రోజుకు 16.2 గ్రాములు. ఏడాదికి సుమారు 6 కిలోలు  

ఏ వంట నూనె ఎలా?  
వేరుశనగ నూనె: అధ్యయనంలో దీన్నే ప్రామాణిక నూనెగా తీసుకున్నారు. దక్షిణాదిన అధికంగా వినియోగించే ఈ నూనెతోనే మిగతావాటిని పోల్చారు. దీన్ని ప్రధానంగా ఉపయోగించే వారిలో ఎల్‌డీఎల్‌ పెరుగుదల తక్కువగా ఉంది.
సన్‌ఫ్లవర్‌ నూనె: దక్షిణాదిన ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎల్‌డీఎల్‌ ముప్పు వేరుశనగతో పోలిస్తే.. 1.5 రెట్లు ఎక్కువగా ఉంది.  
పామాయిల్‌: ఎల్‌డీఎల్‌ ముప్పు 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 
సోయాబీన్‌ నూనె: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఎల్‌డీఎల్‌ ముప్పు 1.8 రెట్లుగా నమోదైంది. 
కొబ్బరి నూనె: ప్రధానంగా కేరళలో వినియోగించే ఈ నూనెను ఉపయోగించే వారిలో ఎల్‌డీఎల్‌ ముప్పు 2.9 రెట్లు అధికంగా కనిపించింది. 
వెన్న/నెయ్యి: భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. అధిక ఎల్‌డీఎల్‌ ముప్పు 3.4 రెట్లుగా నమోదైంది. 
ఆవ నూనె: ప్రధానంగా ఉత్తర, ఈశాన్య, మధ్య భారతదేశాల్లో వినియోగిస్తారు. వేరుశనగతో పోలిస్తే ఎల్‌డీఎల్‌ అధికంగా ఉండే ప్రమాదం 32% తక్కువగా కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement