వంటింటి బడ్జెట్‌పై వంట నూనెల ధరల పిడుగు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
దిగుమతి వ్యయాల దెబ్బతో పైపైకి ధరలు
తెలంగాణలో ఇప్పటికే లీటరుకు రూ.20–30 వరకు భారం
సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనెల ధరలు రూ.200కు చేరువలో, సోయా రూ.160పైనే, పామాయిల్ రూ.150
మరో 7–8 శాతం పెంపునకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: పండుగల వేళ వంట నూనె ధరలు సలసల కాగుతున్నాయి. దసరా, దీపావళి పండుగలకు సన్నాహాలు మొదలైన సమయంలోనే వంటింటి బడ్జెట్‌పై నూనె ధరలు మరోసారి భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు పెరగడం.. పశి్చమాసియా ఉద్రిక్తతలతో రవాణా, బీమా వ్యయాలు అధికం కావడం.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో సన్‌ఫ్లవర్ నూనె సరఫరాపై అనిశ్చితి.. రూపాయి బలహీనపడటం.. ఇవన్నీ కలిసి దిగుమతి వ్యయాలను పెంచుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్ లో వంట నూనెల ధరలు ఏడాది కాలంలో 20 శాతం వరకు పెరిగాయి. ఇప్పటికే మార్చి నుంచి రెండు విడతల్లో 10–12 శాతం మేర ధరలు పెరగ్గా.. పండుగల డిమాండ్ నేపథ్యంలో మరో 7–8 శాతం పెంపు పరిశీలనలో ఉంది.
రాష్ట్రంలో రూ.20–30 అదనపు భారం
కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రిఫైన్డ్ వెజిటబుల్, సీడ్ ఆయిల్స్ ధరలు మూడు నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.20–30 వరకు పెరిగాయి. జూన్‌లో సన్‌ఫ్లవర్ నూనె లీటరు రూ.150–160, పామాయిల్ రూ.110 –140, వేరుశనగ నూనె రూ.170–185 మధ్య పలికింది. అప్పట్లో వ్యాపారులు ధరలు రూ.200 దాటే అవకాశం ఉందన్నారు. తాజా కేంద్ర ధరల పర్యవేక్షణ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెల 19న తెలంగాణలో ప్యాకింగ్ చేసిన వేరుశనగ నూనె రిటైల్ సగటు ధర రూ.193.64 గా నమోదైంది. అంటే రూ.200 మార్క్‌కు చేరువ లో ఉంది. బ్రాండ్, ప్రాంతం, ప్యాకింగ్, నాణ్యతను బట్టి ధరల్లో తేడాలు ఉంటున్నాయి. సెప్టెంబర్ 22 నాటికి ప్యాకేజ్డ్ వేరుశనగ నూనె రూ.209.58, సన్‌ఫ్లవర్ నూనె రూ.193.97, సోయాబీన్ రూ.166.97, పామాయిల్ రూ.153.03గా ఉంది. రాష్ట్రంలోనూ ఆయా నూనెల ధరలు రూ.200కు చేరడం గమనార్హం.
దిగుమతులపైనే ఆధారం
దేశంలో వినియోగించే వంట నూనెల్లో 58 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పామాయిల్‌కు ఇండోనేషియా, మలేసియా; సోయాబీన్ నూనెకు అర్జెంటీనా, బ్రెజిల్; సన్‌ఫ్లవర్ నూనెకు రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాలపై భారత్ ఆధారపడుతోంది. దీంతో ఆయా దేశాల్లో ఉత్పత్తి, సరఫరా, వాతావరణ పరిస్థితులు, యుద్ధాలు, రవాణా వ్యయాల్లో వచ్చే మార్పులు నేరుగా మన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
మూడోసారి పెంపు!
మార్చి నుంచి ఇప్పటివరకు వంట నూనెల కంపెనీలు రెండు విడతల్లో ధరలు పెంచాయి. ఒక్కో విడతలో 5–6 శాతం మేర పెంపుతో మొత్తం 10–12 శాతం వరకు ధరలు పెరిగాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దేశంలో పండుగల సీజన్. దసరా, దీపావళి సందర్భంగా స్వీట్లు, పిండి వంటల తయారీ పెరగడంతో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ధరలు, దిగుమతి వ్యయాల ఒత్తిడి ఉన్న నేపథ్యంలో పండుగల డిమాండ్ కూడా తోడైతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం ఈ సీజన్‌లో మరోసారి మూడో విడత 7 నుంచి 8 శాతం ధరలను పెంచాలని నూనె కంపెనీలు యోచిస్తున్నాయి. అదే జరిగితే పండుగల సమయంలో వినియోగదారులపై అదనపు భారం తప్పదు. కాగా, వంట నూనెల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది.


