లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ గుట్టు రట్టు
బిల్లుల్లో చేతివాటం.. పెండింగ్ ఎల్‌ఓసీ పేరిట ఖజానాకు కన్నం
కోవిడ్ వ్యాక్సిన్‌లు సైతం బ్లాక్ మార్కెట్‌కు
తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో పేదలకు కార్పొరేట్ వైద్యమందిస్తున్న నిమ్స్‌కు అవినీతి రోగం అంటుకుంది. అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో మంగళవారం ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆయన గతంలో ఎదుర్కొన్న వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరవై ఏళ్లుగా నిమ్స్ ఆర్‌ఎంఓ నుంచి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ అయ్యారు. కాగా.. ఆయన చుట్టూ గతంలో అనేక ఆరోపణలు, కోర్టు కేసులు ముసురుకున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా ఏసీబీ దాడులు జరగడంతో నిమ్స్ వర్గాలు ఉలికిపాటుకు గురయ్యాయి.
అక్రమాల మరకలు ఇలా..
గత ఏడాది రాజమండ్రికి చెందిన వైద్యుడు శ్రీరాములుకు చెందిన రూ.2.7 కోట్ల భూ వివాదం కేసు చుట్టుముట్టింది. ఈ వ్యవహారంలో చీటింగ్, బెదిరింపులకు పాల్పడినట్లు లక్ష్మీ భాస్కర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. సుదీర్ఘ కాలంగా కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా కొన్ని ప్రైవేట్ ఆర్థిక లావాదేవీల వివాదాల్లో నాంపల్లి కోర్టులో సెక్షన్ 420 (చీటింగ్), 406 (నమ్మకద్రోహం) కింద కేసులు నమోదయ్యాయి. ట్రామా బ్లాక్‌లోని ఆయన గదిలో బయటపడిన టపాసుల వ్యవహారం కూడా నిమ్స్‌ను కుదిపేసింది. కోవిడ్ సమయంలో పడకల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలున్నాయి.
రోగికి బెడ్ ఇప్పించేందుకు..
2021లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఒక రోగికి బెడ్ ఇప్పించేందుకు ’ప్రశాంత్’ అనే దళారీ ద్వారా రూ.లక్ష వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నిమ్స్ సంస్ధాగత విచారణలో లక్ష్మీ భాస్కర్ సిఫార్సుతోనే ఆ అడ్మిషన్ జరిగినట్లు తేలడం అప్పట్లో వివాదాస్పదమైంది. పడకల వ్యవహారమే కాకుండా కోవిడ్ సమయంలో వ్యాక్సిన్‌ను కూడా బ్లాక్ మార్కెట్ చేసినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఆస్పత్రి పరిపాలన విభాగంలో ఉన్న ఆయన రోగుల అడ్మిషన్ల విషయంలోనే కాకుండా వారి బిల్లుల్లో సైతం చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. రోగుల డిశ్చార్జికి సంబంధించిన పెండింగ్ ఎల్‌ఓసీ పేరిట సంస్థ ఖజానాకు లోటు తీసుకువచ్చారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.
తాజాగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో 13 చోట్ల సోదాలు నిర్వహించిన నేపథ్యంలో లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి అక్రమాల ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి. పడకల కేటాయింపు మొదలు ఆస్పత్రిలో కాంట్రాక్టర్ల వరకు అన్నింటా తానై అన్నట్టు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఉద్యోగులు, వైద్యులు పదోన్నతులు, వారి అంతర్గత బదిలీల వ్యవహారంలో కూడా ఆయన తనదైన శైలిని ప్రదర్శించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిమ్స్ వంటి పెద్ద ప్రభుత్వ వైద్య సంస్థలో అత్యున్నత హోదాలో ఉన్న అధికారిపై వరుసగా చీటింగ్, అవినీతి ఆరోపణలు రావడం వైద్య వర్గాల్లో అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఇదీ చదవండి: ఆరోగ్యానికి చెల్లు 'చీటీ'!
లగ్జరీ కార్లు.. విలాసవంతమైన ఫ్లాట్లు
జాగ్వార్, ఆడి వంటి లగ్జరీ కార్లు.. కూకట్‌పల్లి, మణికొండ, ఇతర ప్రాంతాల్లో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో విలాసవంతమైన ఫ్లాట్లు. వైజాగ్‌తోపాటు తెలంగాణలోనూ రూ.కోట్ల విలువైన ఓపెన్ ప్లాట్లు. అర కిలోకుపైగా బంగారు ఆభరణాలు..రూ.లక్షల్లో బ్యాంకు బ్యాలెన్స్, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడులు కలిపి రూ.కోట్లకు పైనే.. ఇవీ నిమ్స్ ఆస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీభాస్కర్ ఆస్తులు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయన నివాసంతోపాటు నిమ్స్, బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 7 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. దీంతో ఆస్పత్రి వైద్యులు, అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హైదరాబాద్ చుట్టపక్కలే ఎక్కువగా..
నగరంలోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో విలాసవంతమైన ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో నాలుగు బెడ్ రూం, 2 ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్లు కూకట్‌పల్లిలో ఉండగా, మణికొండ, కూకట్‌పల్లి, పేట్‌బïÙర్‌బాద్‌లో 5 డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు ఉన్నాయి. యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో 4 ఓపెన్ ప్లాట్లతోపాటు వైజాగ్‌లో 800 చదరపు గజాల ప్లాట్ ఉంది.
ఇదీ చదవండి: 10 నిమిషాలకో కేసు.. 20 నిమిషాలకో మరణం!
బ్యాంక్ బ్యాలెన్స్ రూ.41 లక్షలు ఉండగా, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. రూ.35 లక్షల వరకు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ రూ.29.50 లక్షలు, బంగారు ఆభరణాలు 517 గ్రాములు, జాగ్వార్, ఆడి, టాటా కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు, రూ.5 లక్షల విలువైన మోటారు సైకిళ్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.6.13 కోట్లుగా నిర్ధారించారు. డీఆర్‌టీ వివాదంలో ఉన్న ఆస్తి కొనుగోలుకు రూ.1.30 కోట్లు, వివిధ వ్యక్తులకు అప్పుగా ఇచ్చిన మరో రూ.1.33 కోట్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు వివరించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
కేసు దర్యాప్తులో ఉందని, మరిన్ని ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతుందని అధికారులు వివరించారు. నిమ్స్ ఆస్పత్రిలో బెడ్స్ నుంచి నియామకాలు, ఇతర కాంట్రాక్టుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


