ఆరోగ్యానికి చెల్లు‘చీటీ’! | Selling medicines without a prescription in the country | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి చెల్లు‘చీటీ’!

Sep 23 2026 5:58 AM | Updated on Sep 23 2026 5:58 AM

Selling medicines without a prescription in the country

దేశంలో ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల విక్రయాలు 

కీలక మందుల విషయంలోనూ ఇదే పరిస్థితి 

లోకల్‌ సర్కిల్స్‌ జాతీయ సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయంపై ఉన్న నిబంధనలను మెడికల్‌ షాపు వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని.. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని జాతీయ స్థాయిలో ‘లోకల్‌ సర్కిల్స్‌’నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో గత 12 నెలల్లో మందులు కొనుగోలు చేసిన 327 జిల్లాలకు చెందిన 1.06 లక్షల మంది (63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు) నుంచి సర్వే సంస్థ అభిప్రాయాలు సేకరించింది. 

సర్వే సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. మెడికల్‌ షాపుల నిర్వాహకులు తమను ప్రిస్క్రిప్షన్‌ అడగలేదని లేదా అరుదుగా అడిగారని 64 శాతం మంది బదులివ్వగా తమకు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వడానికి షాపుల వాళ్లు నిరాకరించారని 15 శాతం మందే చెప్పారు. షాపుల్లో అర్హత కలిగిన ఫార్మసిస్టు సహాయం లభిస్తోందని 31 శాతం మంది, అర్హత లేని వ్యక్తుల నుంచి సహాయం పొందుతున్నామని 13 శాతం మంది, సాయం అందడం చాలా అరుదేనని 27 శాతం మంది వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారా డెలివరీ చేసే సమయంలోనూ ప్రి్రస్కిప్షన్‌ను అడగడం లేదని/చాలా తక్కువ సందర్భాల్లోనే అడుగుతున్నారని 41 శాతం మంది తెలిపారు.  

బిల్లులు మాయం.. నకిలీల భయం... 
మందులు కొనుగోలు చేసినప్పుడు తమకు జీఎస్టీ బిల్లు ఇవ్వడం లేదని 26 శాతం మంది చెప్పారు. తాము కొనుగోలు చేసిన మందులు నకిలీవని తర్వాత గుర్తించామని సర్వేలో పాల్గొన్న వారిలో 15 శాతం మంది తెలిపారు. బిల్లుల్లో ఉండే మందుల తాలూకు బ్యాచ్‌ నంబర్లు, గడువు తేదీలు, విక్రేతల వివరాల వల్ల భవిష్యత్తులో ఆయా మందులు నకిలీవిగా లేదా గడువు ముగిసినవిగా తేలితే బిల్లు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. 

చట్టం ఏం చెబుతోంది? 
దేశంలో మందుల విక్రయాలను నియంత్రించే డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ (1940) డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ రూల్స్‌ (1945) ఆయా మందుల స్వరూప స్వభావాలకు అనుగుణంగా నిబంధనలను వర్గీకరించింది. దాని ప్రకారం.. కొన్ని రకాల మందులను ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. అలాగే యాంటీబయోటిక్స్, దుర్వినియోగానికి అవకాశం ఉన్న మందుల విక్రయాలకు ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి.

కొన్ని రకాల మందులను షాపుల్లో ప్రత్యేక లాకర్లలో భద్రపరచాలి. కొన్నింటిని ప్రి్రస్కిప్షన్‌లో రాసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం ఏడాది నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు, కనీసం రూ. 20,000 జరిమానా విధించవచ్చు. డ్రగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌/రద్దు, మందుల స్వా«దీనం, క్రిమినల్‌ కేసు వంటి చర్యలు కూడా ఉంటాయి. నకిలీ మందులకు సంబంధించిన ఉల్లంఘనలకు మరింత కఠిన శిక్షలు ఉంటాయి. 

ఆందోళన కలిగిస్తున్న గతానుభవాలు 
గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో 17 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద డ్రగ్‌ ఓవర్‌డోస్‌ ద్వారా మరణించగా మరో ఇద్దరు యువకులు అనారోగ్యానికి గురయ్యారు. వారు పెయిన్‌ కిల్లర్‌లను ఇంజెక్ట్‌ చేసుకున్నారని.. అది ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపు నుంచి కొన్నారని తేలడంతో షాపు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ ఏడాది మేలో రామంతాపూర్‌లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు ఒక మెడికల్‌ షాపుపై దాడి చేశారు. కోడైన్‌ కలిగిన టాస్సెక్స్‌ కాఫ్‌ సిరప్, ట్రామడాల్‌ కలిగిన స్పాస్మో ప్రోక్సివన్‌ ప్లస్‌ మందులను ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయించడం తదితర ఉల్లంఘనలకుగాను 166 మెడికల్‌ షాపులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement