breaking news
Medical Shops
-
ఆరోగ్యానికి చెల్లు‘చీటీ’!
సాక్షి, హైదరాబాద్: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయంపై ఉన్న నిబంధనలను మెడికల్ షాపు వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని.. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని జాతీయ స్థాయిలో ‘లోకల్ సర్కిల్స్’నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో గత 12 నెలల్లో మందులు కొనుగోలు చేసిన 327 జిల్లాలకు చెందిన 1.06 లక్షల మంది (63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు) నుంచి సర్వే సంస్థ అభిప్రాయాలు సేకరించింది. సర్వే సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. మెడికల్ షాపుల నిర్వాహకులు తమను ప్రిస్క్రిప్షన్ అడగలేదని లేదా అరుదుగా అడిగారని 64 శాతం మంది బదులివ్వగా తమకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడానికి షాపుల వాళ్లు నిరాకరించారని 15 శాతం మందే చెప్పారు. షాపుల్లో అర్హత కలిగిన ఫార్మసిస్టు సహాయం లభిస్తోందని 31 శాతం మంది, అర్హత లేని వ్యక్తుల నుంచి సహాయం పొందుతున్నామని 13 శాతం మంది, సాయం అందడం చాలా అరుదేనని 27 శాతం మంది వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా డెలివరీ చేసే సమయంలోనూ ప్రి్రస్కిప్షన్ను అడగడం లేదని/చాలా తక్కువ సందర్భాల్లోనే అడుగుతున్నారని 41 శాతం మంది తెలిపారు. బిల్లులు మాయం.. నకిలీల భయం... మందులు కొనుగోలు చేసినప్పుడు తమకు జీఎస్టీ బిల్లు ఇవ్వడం లేదని 26 శాతం మంది చెప్పారు. తాము కొనుగోలు చేసిన మందులు నకిలీవని తర్వాత గుర్తించామని సర్వేలో పాల్గొన్న వారిలో 15 శాతం మంది తెలిపారు. బిల్లుల్లో ఉండే మందుల తాలూకు బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు, విక్రేతల వివరాల వల్ల భవిష్యత్తులో ఆయా మందులు నకిలీవిగా లేదా గడువు ముగిసినవిగా తేలితే బిల్లు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. చట్టం ఏం చెబుతోంది? దేశంలో మందుల విక్రయాలను నియంత్రించే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ (1940) డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ (1945) ఆయా మందుల స్వరూప స్వభావాలకు అనుగుణంగా నిబంధనలను వర్గీకరించింది. దాని ప్రకారం.. కొన్ని రకాల మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. అలాగే యాంటీబయోటిక్స్, దుర్వినియోగానికి అవకాశం ఉన్న మందుల విక్రయాలకు ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి.కొన్ని రకాల మందులను షాపుల్లో ప్రత్యేక లాకర్లలో భద్రపరచాలి. కొన్నింటిని ప్రి్రస్కిప్షన్లో రాసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం ఏడాది నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు, కనీసం రూ. 20,000 జరిమానా విధించవచ్చు. డ్రగ్ లైసెన్స్ సస్పెన్షన్/రద్దు, మందుల స్వా«దీనం, క్రిమినల్ కేసు వంటి చర్యలు కూడా ఉంటాయి. నకిలీ మందులకు సంబంధించిన ఉల్లంఘనలకు మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఆందోళన కలిగిస్తున్న గతానుభవాలు గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద డ్రగ్ ఓవర్‌డోస్ ద్వారా మరణించగా మరో ఇద్దరు యువకులు అనారోగ్యానికి గురయ్యారు. వారు పెయిన్ కిల్లర్లను ఇంజెక్ట్ చేసుకున్నారని.. అది ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపు నుంచి కొన్నారని తేలడంతో షాపు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది మేలో రామంతాపూర్‌లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఒక మెడికల్ షాపుపై దాడి చేశారు. కోడైన్ కలిగిన టాస్సెక్స్ కాఫ్ సిరప్, ట్రామడాల్ కలిగిన స్పాస్మో ప్రోక్సివన్ ప్లస్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయించడం తదితర ఉల్లంఘనలకుగాను 166 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
మందు గోలీ.. ఖాళీ!
(చిలుకూరి అయ్యప్ప) ఈఎస్ఐ డిస్పెన్సరీలతో పాటు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులు కూడా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్నపాటి జబ్బులకు కూడా సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా మందులు కరువయ్యాయి. కొన్ని డిస్పెన్సరీల్లో జ్వరం, దగ్గు మందులు కూడా లేవు. అనారోగ్యంతో వెళ్లే రోగులకు సాధారణ పరిశీలన నిర్వహించి మందు బిళ్లలు రాసిస్తున్నారు. మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కార్మీకుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేస్తున్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) స్ఫూర్తి దెబ్బతింటోంది. నిధుల కొరత, క్షేత్రస్థాయి డిమాండ్‌పై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్నెల్లుగా సమస్య జఠిలం గత ఆర్నెల్లుగా సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ ఈ సమస్య తీవ్రమైంది. కొన్ని డిస్పెన్సరీల్లో పారాసిటమల్ మాత్రలు కూడా నిండుకున్నాయి. మందులు ఇవ్వకపోవడంపై కొన్నిచోట్ల రోగులు, వైద్య సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ప్రాంతీయ ఆస్పత్రుల్లో సర్జరీలు చేయించుకున్న రోగులకు కేవలం రెండ్రోజులకు సరిపడా మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వాటిని డిస్పెన్సరీల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడ స్టాక్ లేకపోవడంతో మందులు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డిమాండ్ తెలిస్తేనే కొనుగోలు.. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందుల అంశం ఇప్పుడు అధికారులు, సిబ్బంది మధ్య దుమారం రేపుతోంది. ఉన్నతాధికారులకు ఈ అంశంపై ఫిర్యాదులు, వినతులు అందుతున్నాయి. సాధారణంగా మందుల కొనుగోలు ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. దీంతో వారు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో మందుల కొనుగోలుకు అనుమతి వచి్చనట్లు సమాచారం. కాగా ఈ అంశంపై నాచారం ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘మందుల కొనుగోలుకు పది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో డిస్పెన్సరీల నుంచి డిమాండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నాం. ఈ నెల ఐదో తేదీ కల్లా సమరి్పంచాలని ఆదేశించాం. అక్కడ్నుంచి నివేదికలు అందిన తర్వాత వాటిని క్రోడీకరించి కొనుగోలు ప్రక్రియ చేపడతాం’అని ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు పద్ధతి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎస్‌ఎంఐడీసీ) నేరుగా మందులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. ఈఎస్ఐ ఆస్పత్రులకు మాత్రం సూపరింటెండెంట్లు.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. వాటిని తమ పరిధిలోని డిస్పెన్సరీలకు సరఫరా చేయాలి. బిల్లుల చెల్లింపులు మాత్రం సూపరింటెండెంట్ స్థాయిలోనే ఉంటుంది. రాష్ట్రంలో ఈఎస్ఐ స్వరూపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈఎస్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. ఒక్కో చందాదారు నెలకు తన వేతనంలో 0.75 శాతం చందా ఇస్తుండగా, యాజమాన్యం 3.25 శాతం చొప్పున చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్‌కు జమ అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్ ఎంప్లాయిస్ సేŠట్ట్ ఇన్సూరెన్స్ విభాగానికి నిధులు విడుదల చేస్తుంది. ఏటా సగటున రూ.650 కోట్ల మేర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర విభాగానికి నిధులు అందుతాయి. దీంతో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. ⇒ రాష్ట్రంలో నాలుగు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఇవి నడుస్తున్నాయి. ⇒ వీటి పరిధిలో 71 డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ రీజియన్ పరిధిలో 53 డిస్పెన్సరీలుండగా, వరంగల్ రీజియన్ పరిధిలో 18 ఉన్నాయి. ⇒ అదేవిధంగా రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు నిజామాబాద్, జీడిమెట్లలో ఉన్నాయి. ⇒ 21 లక్షల ఈఎస్ఐ చందాదారులకు సంబంధించి మొత్తం 90 లక్షల నుంచి కోటి మంది సభ్యులున్నట్లు అంచనా. ఒక్కో కార్డుదారు కుటుంబంలో తల్లిదండ్రులు, ఇతర సభ్యులు కూడా ఉంటారు. దీంతో సేవలు అందుకునే వారి సంఖ్య కోటికి చేరువలో ఉంది. ⇒ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఓపీ సేవలు అందిస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు సర్జరీలు, ఇన్‌పేషంట్ సేవలు, స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ సేవలు అందించాలి. సేవలు అందుబాటులో లేకుంటే రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. ఈ కేసులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విడుదల చేస్తారు. అదేవిధంగా కొత్త డిస్పెన్సరీల ఏర్పాటు బాధ్యత ఇన్సూరెన్స్ మెడికల్ స ర్వీసెస్ డైరెక్టరేట్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి ఈఎస్ఐసీ రేట్ కాంట్రాక్ట్ ప్రకారం1,200ల రకాల మందులు కొనుగోలు చేయాలి. కానీ ఆస్పత్రులలో కేవలం 200లోపు రకాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు 365 రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మందులు లేకపోవడం బాధాకరం. కనీసం టీటీ ఇంజక్షన్ కూడా లేదనడం దారుణమైన విషయం. కార్మీకుల నుంచి ప్రతి నెలా చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేషన్.. మందులను కూడా సకాలంలో కొనుగోలు చేసి పంపించాలి. అలాకాకుండా క్షేత్రస్థాయిలో మందులు కొనుగోలు చేసుకోవాలని చెప్పడం విచారకరం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మందుల సమస్యను పరిష్కరించాలి. – బి.అర్జున్, సీఐటీయూ నాయకులు, సంగారెడ్డి సేవలు అధ్వానం షుగర్ కిట్లు అందుబాటులో లేవు. ఆర్నెల్లుగా వీటి జాడ లేదు. చాలావరకు టెస్టులు బయటే చేయిస్తున్నారు. నా మిత్రుడు అత్యవసర పరిస్థితిలో సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేందుకు ప్రయత్నిస్తే అక్కడి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. ఈఎస్ఐ సేవలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. – గంగాధర్‌రావు బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వట్లేదు మా తల్లిదండ్రులకు బీపీ, షుగర్ ఉంది. దీంతో ప్రతి నెలా మాత్రల కోసం ఈఎస్ఐ ఆర్సీపురం ఆస్పత్రికి వెళ్తాను. గత నాలుగు నెలలుగా ఈ మాత్రలు లభించడం లేదు. ఇద్దరికీ బీపీ, షుగర్ మాత్రలకు రూ.వెయ్యి ఖర్చు అవుతోంది. నెలవారీ చందా చెల్లిస్తున్నా నాకు పెద్దగా ఉపయోగం కలగడంలేదు. – బి.విష్ణు, పటాన్చెరుఇంజక్షన్ కోసం ఇబ్బందులు మా బాబుకు హిమోఫిలియా అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. దీనికి ప్రత్యేక ఇంజక్షన్ అవసరం. ఆర్సీపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో సంప్రదించా. అక్కడ స్టాక్ లేదని చెప్పారు. నాచా రం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి ఆ ఇంజక్షన్ తెచ్చుకునేందుకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. – అశోక్ ముదిరాజ్, ఆర్సీపురం -
ఆంక్షల చట్రంలో సిరప్లు
ఎంతో జాప్యం జరిగాక భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దగ్గుకు వాడే సిరప్లు ఇకపై వైద్యుల చీటి లేకుండా అమ్మరాదని ఔషధ దుకాణాలపై ఆంక్షలు తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9నే వెలువడిన ఆ నోటిఫికేషన్ మంగళవారం వెలుగులోకొచ్చింది. విదేశాలతో పోలిస్తే మన వైద్య ఆరోగ్యరంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత చాలా ఎక్కువ. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఔషధ దుకాణాల కొరత మాత్రం ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి ఔషధాలైనా విక్రయించే అలవాటు కూడా ఎక్కువే. ఈ వెసులుబాటు ఎంత వరకూ వచ్చిందంటే చిన్న చిన్న సమస్యలకు వైద్యుల్ని ఆశ్రయించటంకన్నా మందుల దుకాణంలో సమస్య చెబితే సరిపోతుందన్న అభిప్రాయం సామాన్య జనంలో స్థిరపడింది. పేదరికంవల్ల వైద్యుల దగ్గరకెళ్లే స్థోమత లేకపోవటం కూడా ఇందుకొక కారణం. విదేశాల్లో కేవలం కొన్ని రకాల విటమిన్ మాత్రలు, జలుబు మందులు మాత్రమే చీటి లేకుండా లభిస్తాయి. యాంటీ బయోటిక్స్, కొన్ని ఇతర ఔషధాలు కావాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉంటేనే విక్రయిస్తారు. ఇక దగ్గు మందు విషయానికొస్తే మనకు అంతర్జాతీయంగా చాలా చెడ్డపేరొచ్చింది. 2022లో పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో మన దేశంనుంచి దిగుమతైన దగ్గుమందు సేవించి 70 మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు అందరూ మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నవారే. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్‌లో కూడా ఈ కారణంగానే మరో 18 మంది పిల్లలు చనిపోయారు. అటుతర్వాత ఇండోనేసియా, మార్షల్ ఐలాండ్స్ వంటిచోట్ల భారతీయ దగ్గు మందుల నాణ్యతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. మన దేశంలోనూ సమస్యలు తలెత్తిన ఉదంతాలున్నాయి. నిరుడు అక్టో బర్లో మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు వాడకంవల్లే 22 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. ఆ సిరప్‌లో డై ఇథిలీన్ గ్లైకాల్(డీఈజీ) అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకం 45 శాతం ఉన్నట్టు తేలింది. వాస్తవానికి ఆ మందులో అనుమతించదగ్గ పరిమితి కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే పరిమితికి మించి వందల రెట్లు ఎక్కువుందన్న మాట! మన ఔషధరంగ నియంత్రణ వ్యవస్థలు పకడ్బందీగా లేవన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్(ఎంఆర్ఎఫ్) నివేదిక ప్రకారం 2024లో దగ్గు మందుల మార్కెట్ విలువ దాదాపు 27 కోట్ల డాలర్లు కాగా, అది యేటా 9.9 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు. 2035 నాటికి ఇది మూడురెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఔషధాల తయారీ, దిగుమతులు, క్లినికల్ పరీక్షలు, ప్రమా ణాల రూపకల్పన కోసం మనకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఉంది. దీనికింద ఆరు జోనల్ కార్యాలయాలు, సబ్ జోనల్ కార్యాల యాలు, వీటికి అనుబంధంగా డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ఇవిగాక రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణలున్నాయి. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి వైద్యసలహా లేకుండానే దుకాణదారుల దగ్గర లభ్యమవుతున్నాయంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవటం వల్లనేనని చెబుతారు. మన దేశంలో 1,100 దగ్గుమందు ఉత్పాదక సంస్థలుండగా, తనిఖీ చేసిన 90 శాతం సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘనలు కనబడ్డాయనీ, వాటిపై చర్యలు తీసుకుంటు న్నామనీ ఇటీవల డీసీజీఐ రాజీవ్ రఘువంశీ చెప్పారు. దగ్గు మందు మాత్రమే కాదు... యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు, గర్భస్రావ మాత్రలు, నిద్ర మాత్రలు వగైరాల విషయంలోనూ నియంత్రణలు అవసరం. వైద్యుల సలహా లేకుండా వాడటంవల్ల పౌరుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆ సంగతి గ్రహించేలోగానే పరిస్థితి చేయిదాటుతోంది. గర్భస్రావ మాత్రలైతే మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. కనుక మొత్తంగా ఔషధ రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయటం అత్యవసరం. -
మెడికల్ షాప్ సిబ్బందిపై బుల్లెట్ల వర్షం.. క్యాషియర్ మృతి
చంఢీగడ్: మెడికల్ షాప్‌లోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటన చంఢీగఢ్‌లో చోటు చేసుకుంది. మెడికల్స్టోర్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఒక్కసారిగా మెడికల్ షాప్‌లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్యాషియర్ మృత్యువాత పడ్డారు. మెడికల్ షాపులో చొరబడి కాల్పులు జరపడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెడికల్ షాపులోకి చొరబడి కాల్పులు జరపడం వెనుక పాత విభేదాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పాత గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. -
మెడికల్ షాపులు బంద్.. ఏపీలో మూతపడ్డ 45K షాపులు
-
నేడు మెడికల్ షాపులు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆన్లైన్లో మందులు అమ్మకాలను ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (AIOCD) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల దుకాణాలు బుధవారం మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టిసారించారు. మందుల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర, ఇతరత్ర మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు.. ప్రధాన ఫార్మసీ చైన్లు, ఆస్పత్రుల్లోని మెడికల్ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఔట్లెట్స్ మాత్రం తెరిచి ఉండే అవకాశాలున్నాయి.వివాదం నేపథ్యంకోవిడ్ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కానీ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా కార్పొరేట్ ఈ–ఫార్మసీలు ఆ వెసులుబాటును కొనసాగిస్తూ ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. రిటైల్ షాపు యజమానుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్లను వెరిఫై చేయకుండానే మందులు ఇస్తున్నారు(డెలివరీలు సైతం). ఇది ప్రజారోగ్యానికి ముప్పు. అలాగే ఈ చర్యలతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.రిటైల్ వ్యాపారుల ఆందోళనలుఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ రిటైల్ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోందని కెమిస్టులు చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ.. కేవలం డిస్కౌంట్ కోసం ఆన్లైన్లో మందులు కొనడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు.చట్టపరమైన అంశాలుఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్‌లోని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందులు, అలాగే షెడ్యూల్ ఎక్స్‌లోని నిద్ర మాత్రలు, మత్తు మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే ఇవ్వాలి. కానీ ఆన్లైన్ విక్రయాల ద్వారా ఈ మందులు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ హామీఇటీవల AIOCD ప్రతినిధులు కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో సమావేశమై ఈ–ఫార్మసీల నియంత్రణపై చర్చించారు. చట్టపరమైన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.రాష్ట్రాల వైఖరిఅయితే అన్ని రాష్ట్రాలు ఈ బంద్‌లో పాల్గొనడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు.. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్ బంద్‌లో పాల్గొనబోమని లేఖలు సమర్పించాయి.ముగింపుఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ, ప్రజారోగ్య భద్రత, రిటైల్ వ్యాపారుల ఆర్థిక స్థితి.. ఈ మూడు అంశాల మధ్యే వివాదం కేంద్రీకృతమై ఉంది. ఒక రోజు బంద్ ద్వారా కెమిస్టులు తమ ఆందోళనను వ్యక్తం చేయబోతున్నారు.


