ఆంక్షల చట్రంలో సిరప్‌లు | Sakshi Editorial On Syrups Restrictions in India | Sakshi
Sakshi News home page

ఆంక్షల చట్రంలో సిరప్‌లు

Jun 17 2026 12:43 AM | Updated on Jun 17 2026 12:43 AM

Sakshi Editorial On Syrups Restrictions in India

ఎంతో జాప్యం జరిగాక భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దగ్గుకు వాడే సిరప్‌లు ఇకపై వైద్యుల చీటి లేకుండా అమ్మరాదని ఔషధ దుకాణాలపై ఆంక్షలు తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 9నే వెలువడిన ఆ నోటిఫికేషన్‌ మంగళవారం వెలుగులోకొచ్చింది. విదేశాలతో పోలిస్తే మన వైద్య ఆరోగ్యరంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత చాలా ఎక్కువ. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఔషధ దుకాణాల కొరత మాత్రం ఉండదు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఎలాంటి ఔషధాలైనా విక్రయించే అలవాటు కూడా ఎక్కువే. 

ఈ వెసులుబాటు ఎంత వరకూ వచ్చిందంటే చిన్న చిన్న సమస్యలకు వైద్యుల్ని ఆశ్రయించటంకన్నా మందుల దుకాణంలో సమస్య చెబితే సరిపోతుందన్న అభిప్రాయం సామాన్య జనంలో స్థిరపడింది. పేదరికంవల్ల వైద్యుల దగ్గరకెళ్లే స్థోమత లేకపోవటం కూడా ఇందుకొక కారణం. విదేశాల్లో కేవలం కొన్ని రకాల విటమిన్‌ మాత్రలు, జలుబు మందులు మాత్రమే చీటి లేకుండా లభిస్తాయి. యాంటీ బయోటిక్స్, కొన్ని ఇతర ఔషధాలు కావాలంటే ప్రిస్క్రిప్షన్‌ ఉండాలి. అది కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయి ఉంటేనే విక్రయిస్తారు. 

ఇక దగ్గు మందు విషయానికొస్తే మనకు అంతర్జాతీయంగా చాలా చెడ్డపేరొచ్చింది. 2022లో పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో మన దేశంనుంచి దిగుమతైన దగ్గుమందు సేవించి 70 మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు అందరూ మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నవారే. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్‌లో కూడా ఈ కారణంగానే మరో 18 మంది పిల్లలు చనిపోయారు. అటుతర్వాత ఇండోనేసియా, మార్షల్‌ ఐలాండ్స్‌ వంటిచోట్ల భారతీయ దగ్గు మందుల నాణ్యతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. మన దేశంలోనూ సమస్యలు తలెత్తిన ఉదంతాలున్నాయి. నిరుడు అక్టో బర్‌లో మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు వాడకంవల్లే 22 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. ఆ సిరప్‌లో డై ఇథిలీన్‌ గ్లైకాల్‌(డీఈజీ) అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకం 45 శాతం ఉన్నట్టు తేలింది. వాస్తవానికి ఆ మందులో అనుమతించదగ్గ పరిమితి కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే పరిమితికి మించి వందల రెట్లు ఎక్కువుందన్న మాట! 

మన ఔషధరంగ నియంత్రణ వ్యవస్థలు పకడ్బందీగా లేవన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ ఫ్యూచర్‌(ఎంఆర్‌ఎఫ్‌) నివేదిక ప్రకారం 2024లో దగ్గు మందుల మార్కెట్‌ విలువ దాదాపు 27 కోట్ల డాలర్లు కాగా, అది యేటా 9.9 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు. 2035 నాటికి ఇది మూడురెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఔషధాల తయారీ, దిగుమతులు, క్లినికల్‌ పరీక్షలు, ప్రమా ణాల రూపకల్పన కోసం మనకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఉంది. దీనికింద ఆరు జోనల్‌ కార్యాలయాలు, సబ్‌ జోనల్‌ కార్యాల యాలు, వీటికి అనుబంధంగా డ్రగ్‌ టెస్టింగ్‌ లాబొరేటరీలు ఉన్నాయి. 

ఇవిగాక రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణలున్నాయి. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా నాసిరకం మందులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇవి వైద్యసలహా లేకుండానే దుకాణదారుల దగ్గర లభ్యమవుతున్నాయంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవటం వల్లనేనని చెబుతారు. మన దేశంలో 1,100 దగ్గుమందు ఉత్పాదక సంస్థలుండగా, తనిఖీ చేసిన 90 శాతం సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘనలు కనబడ్డాయనీ, వాటిపై చర్యలు తీసుకుంటు న్నామనీ ఇటీవల డీసీజీఐ రాజీవ్‌ రఘువంశీ చెప్పారు. 

దగ్గు మందు మాత్రమే కాదు... యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు, గర్భస్రావ మాత్రలు, నిద్ర మాత్రలు వగైరాల విషయంలోనూ నియంత్రణలు అవసరం. వైద్యుల సలహా లేకుండా వాడటంవల్ల పౌరుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆ సంగతి గ్రహించేలోగానే పరిస్థితి చేయిదాటుతోంది. గర్భస్రావ మాత్రలైతే మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. కనుక మొత్తంగా ఔషధ రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయటం అత్యవసరం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement