Sagubadi: కల్జివ్వ.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ వృక్షం! | Sagubadi: Kaljivvi Cultivation And Medicinal Benefits | Sakshi
Sakshi News home page

Sagubadi: కల్జివ్వ.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ వృక్షం!

Jul 31 2026 8:05 AM | Updated on Jul 31 2026 8:38 AM

Sagubadi: Kaljivvi Cultivation And Medicinal Benefits

అడవి పండ్లు–12

కల్జివ్వి పండ్లు మేడి పండ్ల ఆకారంలో, సైజులో చిన్నగా ఉంటాయి. ఈ చెట్లకు బండజువ్వి, జువ్వి అనే పేర్లు కూడా∙ఉన్నాయి. బండజువ్వి రకం ఎక్కువగా బండకొరుకులు, మొరం నేలలో, చెట్లపై గమనించవచ్చు. జువ్వి, కల్జివ్వి ఒకటే అంటారు. ఈ జాతిలో పొదలు, గుల్మాలు, చెట్లు ఉన్నాయి. వీటిలో ఇతరాలు పైకస్‌ అసినిన, పైకస్‌ ప్యూజెసెన్స్‌, ఉరోస్టిగ్మ టొమెన్‌ టోసం మొదలగునవి ఉన్నాయి.  

ఉనికి: పండ్లు జూన్‌–జులై నెలల్లో వస్తాయి. మేడి పండ్ల చెట్టులో వలెనే ఇందులో కూడా పూలు బయటికి కనపడవు. వీటిల్లో కూడా చీమలు, కందిరీగలు ఫలదీరకణకు దోహదపడతాయి. వీటి పూలను గాల్‌ ఫ్లవర్‌ అని అంటారు. ఈ చెట్ల పూలల్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి మొగ్గ, పొడవాటి కాడ ఆడ, కురుచ కాడ ఆడ పువ్వులు ఉంటాయి.  ఈ చెట్టు దాదాపు 12 మీటర్ల ఎత్తు వరకు పెరగలదు. వీటి పక్క కొమ్మలకు నూగు పోచలుంటాయి. ఆకుల తొడిమ దగ్గర పండ్లు వస్తాయి. ఇవి మైదాన ప్రాంతాల్లో, అడవుల్లోనూ పెరుగుతాయి. ఇంచుమించు అన్ని నేలల్లో వస్తాయి. ఈ చెట్లు సామాన్యంగా సతతహరితంగా ఉంటాయి. కానీ కాలం అనుకూలించకుండా ఉంటే ఆకులు రాల్చుతుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉష్ణమండలం, ఉప–ఉష్ణమండలం ప్రాంతంలో వీటి ఉనికి ఉంటుంది.

కానీ ఇవి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో మాత్రం అండమాన్, నికోబార్‌ దీవులు, బీహార్, మధ్య–దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా నల్లమల అడవులు వీటికి పెట్టింది పేరు. వీటిపై జరిగిన ప్రయోగాలు చాలా తక్కువ. వీటిని సాగుకు మరల్చితే లాభసాటిగా ఉంటుంది.  

ఆకులను మేకలు, పశువులు తింటాయి!
వీటి ఆకులు మేకలు, పశువులు తింటాయి. కరువు కాలాల్లో వీటిని మేతగా వాడతారు. పండ్లు తింటారు.  కలప అంత గట్టిగా ఉండదు, వంట చెరకుగా వాడుకోవచ్చు. మాను లావు ఉంటే దాన్ని పెట్టెల తయారీకి వాడవచ్చు. ముఖ్యంగా పండ్ల రవాణకు ఉపయోగపడుతుంది. రోడ్లకు ఇరు పక్కలా ఈ చెట్లను నాటవచ్చు. ఈ చెట్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆకులను రుబ్బగా వచ్చిన రసాన్ని బొగ్గలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బెరుడును దంచగా వచ్చే గుజ్జును దెబ్బలకు, కోసుకుపోయిన చోట్ల రుద్దినట్లయితే అవి కొన్నిరోజుల్లో మానుతాయి. ఇప్పటికీ చెంచులు వైద్యంలో వాడుతున్నారు. ఈ జాతి మొక్కలను విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. బోన్సాయి (మరుగుజ్జు) మొక్కల పెంపకానికీ ఉపయోగించవచ్చు. ఈ జాతి పండ్లపై అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదనవచ్చు.
- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement