ఈ చెట్టుతో పాములు పారిపోతాయి.. | What Is Wild Kalima Fruit, Know Its Health Benefits, Nutritional Facts, Medicinal Uses, And Farming Potential Explained | Sakshi
Sakshi News home page

Kalima Fruit Benefits: ఈ చెట్టుతో పాములు పారిపోతాయి..

Jul 24 2026 9:31 AM | Updated on Jul 24 2026 9:39 AM

Uses And Significance Of The Wild Kalima Fruit

అడవి పండ్లు–11

కలిమి పండు

కలిమి పండు చాలా మందికి తెలిసిన పండే. కానీ కొండ ప్రాంతాలు, బంజరు భూములు, పొలంగట్లు మొదలగు ప్రాంతాల్లో వచ్చే కలిమి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.

వీటికాయలు వగరు రుచి కలిగి ఉంటాయి. ఇవి నేరుగా తినటానికి అంత అనుకూలంగా లేకున్నా ఇతర ఉపయోగాలెన్నో ఉన్నాయి. పండుగా మారినప్పుడు తియ్యగా ఉండి (నలుపు రంగుకు మారుతుంది) తినటానికి యోగ్యంగా ఉంటుంది. ఈ కాయలు కోసినప్పుడు తొడిమ దగ్గర పాలు కారతాయి. కాబట్టి పండ్లను కడిగి తినటం మంచిది. పండ్లు గుత్తులుగా, ఒకటి, రెండుగా కూడా ఉంటాయి. పండ్లు బఠాణీ గింజ సైజు ఉంటాయి. మేలు రకమైన కలిమి పండ్లను ‘వాక్కాయ’లు అంటారు. ఇవి గచ్చకాయంత ఉంటాయి.

‘కలిమి కాస్తే కాలం అవుతుంది’ అంటారు. అంటే.. సుభిక్షంగా పంటలు పండుతాయని రైతులు, పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం. కరువును తట్టుకొని నిలబడే సత్తా ఈ చెట్టుకుంది.

శాస్త్రీయ నామం: క్యారస్స క్యరండస్‌
కుటుంబం: ఆపోసైనేసి
కలిమి పండు పేర్లు: ఉరూ: కశౌండ ఒరియా: సుశేన కన్నడ: కవలి, హువు, కవలి కాయ్‌. గరిచే, గర్ని, గర్తి, కరండ, అస్సామీ: కరెంజా, కర్ణటెంగ ఇంగీష్‌: కరండస్‌ బెర్రి, క్రేన్‌ బెరీ, కరౌండ కరమకిరె తమిళం: కాలక్కాయి, కలక్కాయి తెలుగు: కలిమి, కలిమిక్కాయ, వాక్కాయ(పెద్ద పండ్లు) మరాఠీ: కర్వండ, కర్విండ, కాలిమైన, బోరోండ మలయాళం: కరక్కా పంజాబీ: గర్న బెంగాలీ: కరోంమ్చా హిందీ: కరోండ, కరౌండ, కరండ సంస్కృతం: కరమర్డ్, కరమర్ది, కరోండ అని పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో కరండస్‌ ప్లం, ఇండోనేసియాలో కరండన్, కరెండంగ్‌ అని, చైనీస్‌లో కు హౌంగీ అని, పాకిస్తాన్‌లో గర్నే, కరండ, కక్రుండ అని, వియత్నాంలో క్యాసిరో, క్జోరో అని, మలేసియాలో బెరెండ, కరెండ, కరెండింగ్‌ అని పిలుస్తారు.

పూత: ఏప్రిల్‌ – మే. పండ్లు కోత: నవంబర్‌– డిసెంబర్‌.

ఉనికి:

  • ఇది సతతహరిత ఆకులురాల్చే గుల్మం (పొదలాంటిది). నేల స్వభావాన్ని బట్టి 2–5 మీటర్ల ఎత్తు పెరగగలదు. గుబురైన మండలు (కొమ్మల), కురుచైన ముళ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని క్రిష్‌ థార్న్‌ అని అంటారు.

  • గుత్తులుగా తెలటి పూలు, అందంగా ఉంటాయి. కాయలు కూడా గుత్తుగా కాస్తాయి. పెద్ద వాక్కాయ పండు నల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉండదు. అదే కలిమి (చిన్నది) పండు నల్లగానే వుంటాయి. కానీ రుచిగా ఉంటాయి.

  • ఈ చెట్లు మన దేశంలో తూర్పు, పడమటి కనుమల అడవుల్లో, నేపాల్, శ్రీలంక, సౌత్‌ ఈస్ట్‌ ఆసియాలోని దేశాల్లో ఉన్నాయి.  వాక్కాయ చెట్లను మాత్రం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.

వాక్కాయి చెట్టు ఆకులు పశుగ్రాసంగా పనికొస్తాయి..
కలిమి చాలా ఉపయోగకరమైన చెట్టు. పెద్ద ఎత్తుగా పెరగకపోయినా ఎక్కువ పంగలు/కొమ్మలతో గుబురుగా ఉంటుంది. ముళ్లతో కూడుకున్న ఈ చెట్లను పొలం చుట్టూ కంచెగా బాగా పని చేస్తాయి.

  • దీని వేర్లను దంచగా వచ్చిన లేపనాన్ని పశువుల పుళ్లపై రుద్దితే పురుగులు చనిపోయి పుళ్లు త్వరగా మానిపోతాయి.

  • దీని వేర్లతో చేసిన పౌడరు/పొడిని నీళ్లలో కలిపి చల్లితే ఆ ప్రదేశాల నుంచి పాములు పారిపోతాయి.

  • వీటి ఆకులను పూల దండల్లో అందం కోసం పెడతారు. త్వరగా వాడిపోవు.

  • కాయలను పచ్చడి తయారు చేయటానికి, అట్లే పూలిహోరలో కూడా వాడుతారు. దీని పచ్చడికి మంచి గిరాకీ  ఉంది.

  • ఈ పండ్లతో జామ్, జల్లీ, పానీయాలు తయారు చేస్తారు.

  • ఆకులు గొర్రెలు, మేకలకు గ్రాసంగా ఉపయోగపడతాయి.

  • ట్యానింగ్‌ పరిశ్రమల్లో ఎండిన ఆకులను వాడుతారు.

  • పండ్లు రుచికరంగా ఉండటం వల్ల పిల్లలు బాగా ఇష్ట పడతారు.

  • ఈ చెట్టు బెట్టెను తట్టుకోగలదు, అన్ని నేలల్లో వస్తుంది.

  • దీని పండ్లను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ముఖ్యంగా అసిడిటీ, అజీర్తి, పుండ్లు, చర్మవ్యాధులు, మూత్ర సంబంధిత, డయాబెటిక్‌ అల్సర్, కడుపు నొప్పి, అజీర్తి, రక్తహీనత, ఆకలి లేకపోవటం, పైత్యం, మనోవికల్పం మొదలగునవి నయం చేయటానికి వాడతారు.

  • ఆకుల కషాయాన్ని, జ్వరాన్ని, విరేచనాలను, చెవి పోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.

పోషక విలువలు మెండు
కలిమి పోషక విలువలను గమనిస్తే చాలా విస్తృతంగా ఉంటాయి. విటమిన్‌–సి, విటమిన్‌ బిలు, ఇనుము ఉండటం వల్ల రక్తహీనత త్వరగా నయమవుతుంది. ఈ పండ్లలో మైరేడ్‌ యాంటిఆక్సిడెంట్స్, అవియే ఫ్లేవనాయిడ్స్, అల్కలాయిడ్స్, టానిన్స్‌, క్యారిస్సోన్, ట్రైటర్‌ ఫెనాయిడ్స్‌.. ఇవి ఉండటం వల్ల యాంటిపైరెడిక్, కార్డియోటానిక్, అనాల్జిన్‌ కారకాలుగా ఉపయోగపడతాయి.

  • ఇందులోని పీచు పదార్థం ఉదర సంబంధిత రోగాల అదుపునకు  ఉపయోగపడుతుంది. విటమిన్‌–సి జ్వరాలను అడ్డుకోడానికి, అదుపునకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని మెగ్నీషియం ఇతర విటమిన్లు, ట్రిప్టెఫాన్‌ వల్ల న్యూరోట్రాన్స్‌మిట్టర్‌ సెరటోనిన్‌ ఉత్పత్తి పెరిగి మానసిక వొత్తిడిని అదుపు చేసి ఆరోగ్యంగా ఉంచగలదు.

  • కలిమి పండులో పెక్టిన్‌ అధికంగా ఉండడంవల్ల జాం, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.

  • కాయల రసం మధుమేహ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ∙ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. ∙దంతాలు పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా కలిమి పండు కాపాడగలదు.

  •  ప్రాంతాలను బట్టి పండ్ల పోషక విలువలలో వ్యత్యాసం ఉంటుంది. నల్లమలలో ఉండే పండ్ల విలువలపై విశ్లేషణ తరుచూ చేయడం అవసరం. ఈ కలిమి లేక వాక్కాయపై వైద్యపరంగా ఎంత పరిశోధన జరిగినప్పటికీ, వీటిలో అనువైన, అధిక దిగుబడులనిచ్చ వంగడాల తయారీలో క్షేత్రస్థాయి పరిశోధనలు తక్కువని చెప్పవచ్చు.

పొలం చుట్టూ కంచె
కలిమి తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరిగే గుల్మం లేక చిరు చెట్టు అనవచ్చు. నల్లమల అడవుల్లో కలిమి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వీటి ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి పూత దశ నుంచి మొదలుకొని, పండు దశ వరకు పరిశీలించటం ముఖ్యం. అందులోని వేరియంట్స్‌ను గమనించి క్షేత్రస్థాయికి తీసుకురాగలిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

ప్రస్తుతానికి రైతులు ఈ చెట్టును పొలం చుట్టూ కంచెగా వాడుతున్నారు. కాయలను (అడవి కలిమికాదు, వాక్కాయను) మార్కెట్‌ చేసుకోవచ్చు. అక్కడక్కడా వాక్కాయ తోటలు పెంచుతున్నట్లు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, అడవి కలిమిపై సరైన పరిశోధనలు చేపట్టి తినటానికి అనువుగా మార్చటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చెయ్యాలి. కలిమి పండ్లను అతిగా తింటే వాంతులు, విరేచనాలు రావచ్చు. కాబట్టి, ఎందుకైనా మంచిది మితంగా తినాలి.

- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement