నీటి ఎద్దడిని జయించి.. బహుళ పంటలతో లాభాలు..
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు సున్నా
భగవతీ లాల్, రేఖ రసాయనాలు వాడకుండా ఏటా 30 రకాల పంటలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. పశువుల పేడ, మూత్రంతో సేంద్రీయ ఎరువులు తయారుచేస్తూ, తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణ, మంచి ఆరోగ్యం, స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
నీటి కొరతను జయించిన తీరు
ఎడారి సరిహద్దు ప్రాంతాల్లో నీటి కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి ప్రధాన అడ్డంకులు. ఈ సవాళ్లను అధిగమించడానికి భగవతీ లాల్ దంపతులు బహుళ అంతస్థుల్లో అనేక రకాల పంటలను కలిపి సాగు చేసే పద్ధతిని ఆశ్రయించారు.
నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి, తిరిగి నేలలోనే కలియదున్నారు. దీనివల్ల మట్టిలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యం గణనీయంగా పెరిగింది.
వివిధ ఎత్తుల్లో పెరిగే బొ΄్పాయి, అంజీర వంటి పండ్ల చెట్లతో పాటు వాటి నీడలో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. దీనివల్ల నేరుగా ఎండ తగలకుండా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతున్నారు.
నీటి ఎద్దడి ఉన్న సమయాల్లో కూడా ఈ సమగ్ర సాగు విధానం వల్ల పంటలు ఎండిపోకుండా నిలదొక్కుకుంటున్నాయి.
ఏడాదిలో 30 పంటలు
ఈ దంపతులు తమ చిన్న పొలంలోనే ఏడాది పొడవునా దాదాపు 30 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. మూడు ఆవులు, ఒక గేదెలను పెంచుకుంటూ పాలపై అదనపు ఆదాయం పొందుతున్నారు.
ఎటువంటి పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడరు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కీటక నాశక కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటారు. తమ పొలానికి కావలసిన దానికంటే ఎక్కువ సేంద్రియ ఎరువులను తయారుచేస్తున్నారు. తమ పొలంలో వాడగా మిగిలిన సేంద్రియ ఎరువులను పొరుగు రైతులకు అమ్ముతున్నారు.
ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ
ఈ నమూనాలో అత్యంత ముఖ్యమైన అంశం పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ నికర లాభం పెంచుకోవటమే.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు సున్నాకు చేరింది. ఇంధన వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం పడిపోయింది. ∙ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగైంది. ‘మాకు డాక్టర్లు, మందుల ఖర్చు పూర్తిగా లేకుండా పోయింది’ అని రేఖ ఆనందంగా చెబుతారు.
రసాయనాలు లేని నాణ్యమైన పండ్లు, కూరగాయల కోసం కొనుగోలుదారులే నేరుగా వీరి పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు, దళారుల కమీషన్ల భారం తప్పి అధిక నికరాదాయం లభిస్తోందని రేఖ వివరించారు.
‘సేవా మందిర్’ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సాంకేతిక సహకారం, మెరుగైన విత్తనాలతో పునాది వేసుకున్న భగవతీ లాల్–రేఖ దంపుతుల ప్రకృతి వ్యవసాయ మోడల్, పరిమిత వనరులు ఉన్న ప్రతి చిన్నకారు రైతుకూ లాభదాయకమైన దిక్సూచిగా నిలుస్తోంది.
భూమి విస్తీర్ణం చిన్నదైనా, ఆలోచన పెద్దదైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్ లోని రాజ్‌సమంద్ జిల్లా సేమా గ్రామానికి చెందిన భగవతీ లాల్, రేఖ అనే రైతు దంపతులు. పావు ఎకరం (అర బిఘా) భూమి ఉంటే ‘దీనితో ఏం చెయ్యలం?’ అని చాలామంది రైతులు నిరాశపడతారు. కానీ ఈ దంపతులు అదే పావు ఎకరం పొలాన్ని పచ్చని ప్రకృతి నందనవనంగా, లాభసాటి వ్యవసాయ వ్యాపార నమూనాగా మార్చి గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచారు.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


