అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్‌శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్‌శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్‌శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్‌శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.
వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్‌ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.
‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్‌శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్‌ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.
అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్‌లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్‌శ్రీ.
రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్‌లో ప్రస్తావించింది దేవ్‌శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్‌శ్రీ.
ఘోస్ట్ జాబ్స్ అంటే?
ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్‌లైన్‌లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్‌ను కంపెనీలు సృష్టిస్తుంటాయి.


