మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్‌పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్‌గా, కంటెంట్‌గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర‍్తయ్యాడు.
వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.
ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.
వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్‌పూర్ కొత్వాలి ఇన్‌చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.


