సీజేపీ నిరసనకు స్పాన్సర్‌ ఎవరు?.. అసలు కథ ఇదే | CJP Protest Support Mystery, Food Deliveries Pour Into Jantar Mantar As Questions Rise Over Donors And Funding Sources | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసనకు స్పాన్సర్‌ ఎవరు?.. అసలు కథ ఇదే

Jul 23 2026 7:38 AM | Updated on Jul 23 2026 10:38 AM

No Names No Faces But Endless Support Hidden Story Behind CJP Protest

నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్‌మంతర్‌ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్‌లాంటి నగరాల నుంచి ఆర్డర్‌ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్‌ నుంచి ఫండింగ్‌ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.

జంతర్‌మంతర్‌కు వరుసగా.. 
నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్‌ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్‌ చావల్‌, రాజ్మా చావల్‌, టీ, శాండ్‌విచ్‌లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్‌ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?
నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్‌పూర్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 

జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతు
జూలై 20న చలో సంసద్‌కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్‌ మంతర్‌ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్‌ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.

ఫండింగ్‌పై రాజకీయ ఆరోపణలు.. సోషల్‌ మీడియాలో చర్చ
అయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.

సోషల్‌ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్‌ సపోర్ట్‌ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.

పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతు
ప్రస్తుతం జంతర్‌మంతర్‌ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్‌మంతర్‌ ఫుడ్‌ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement