బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు విరిగిన నొప్పితో పోలుస్తుంటారు. కానీ ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి ఉంటే ఆ బాధ కూడా తక్కువగా అనిపిస్తుంది. అలాంటి దృశ్యమే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రసూతి వార్డులో కనిపించింది. నవజాత శిశువును చూడకముందే, ప్రసవ వేదనను భరించిన తన భార్య వద్దకు ఓ భర్త పరుగెత్తి వెళ్లాడు.
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో డాక్టర్ నవజాత శిశువును చేతుల్లో పట్టుకుని భర్తను గదిలోకి పిలిచారు. సాధారణంగా తండ్రి ముందుగా బిడ్డను ఎత్తుకుంటాడని అందరూ భావిస్తారు. కానీ ఈ వీడియోలో భిన్నంగా జరిగింది.
గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి, ఆ శిశువును పట్టించుకోకుండా నేరుగా తన భార్య వద్దకు వెళ్లాడు. బిడ్డ గది ప్రవేశద్వారం దగ్గరే ఉన్నా, అతను ముందుగా భార్యను గట్టిగా కౌగిలించుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ప్రసవ వేదన నుంచి బయటపడిన ఆమె భావోద్వేగానికి గురైంది.
ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి డాక్టర్‌కు ధన్యవాదాలు తెలిపి, తన భార్యతో కలిసి బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "దేవుడా... ఇలాంటి జీవిత భాగస్వామి అందరికీ దొరకాలి" అని పేర్కొన్నాడు.


