రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్ నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం గురించి తెలుసుకున్న ఓ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై ఉన్న అభిప్రాయాలు, రోడ్డుపక్కన వ్యాపారం చేసే వారిపై ఉన్న భావనలపై చర్చ మొదలయ్యేలా చేసింది ఈ వీడియో.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ చిరుతిళ్లు అమ్మే ఫుడ్ స్టాల్‌ను సందర్శించింది. అతను నెలకు సుమారు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. తన జీతం మాత్రం చెప్పుకునే స్థాయిలో లేదని సరదాగా చెప్పింది.
"రోడ్డుపక్కన బండి పెట్టి అమ్మితే ఏమి వస్తుంది? అని అనుకునే వారు ఈ వీడియో చూసి తమ ఆలోచన మార్చుకోవాలి" అని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోమల్ నేగి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. వీడియో ప్రారంభంలో కోమల్ నేగి రోడ్డుపక్కన ఉన్న ఒక ఫుడ్ స్టాల్‌ను చూపించింది. అక్కడ ఒక వ్యక్తి మ్యాగీ, ఛోలే-కుల్చే వంటి వంటకాలు అమ్ముతున్నాడు. అతనితో మాట్లాడిన సమయంలోనే నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాడు.
సోషల్ మీడియాలో స్పందన
ఈ వీడియో చూసిన చాలామంది నవ్వు ఎమోజీలతో స్పందించారు. ఒకరు "అతను నాకు ఉద్యోగం ఇస్తాడా?" అని కామెంట్ చేశారు. ఇంకొకరు "ఆదాయపు పన్ను లేదు, అద్దె లేదు" అని పేర్కొన్నారు. ఇంకొకరు "అతను కష్టమైన శారీరక శ్రమ చేస్తున్నాడు. నువ్వు చేయడం లేదు. ఈ పోలిక సరైంది కాదు" అని రాశారు.


