సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది.
నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.
పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్‌పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.
అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది.


