కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆస్తులు, ఆదాయం, పెట్టుబడులపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం మొత్తం ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.92 కోట్లు కాగా, అప్పులు రూ.2.30 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు. ఆయన భార్య మృదులా ఠాకూర్ మాత్రం అదే ఏడాది రూ.49.92 లక్షల ఆదాయం పొందారు. చేతిలో నగదు విషయానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద రూ.35 వేలు, ఆయన భార్య వద్ద రూ.40 వేలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల వద్ద కలిపి మరో రూ.17 వేలు నగదు ఉండటంతో కుటుంబం మొత్తం చేతిలో ఉన్న నగదు రూ.92 వేలుగా నమోదైంది.
పెట్టుబడుల విషయానికి వస్తే.. బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులు కలిపి కుటుంబం వద్ద సుమారు రూ.2.47 కోట్లు ఉన్నట్లు సమాచారం. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షలు, బీమా పాలసీల్లో రూ.67.72 లక్షలు పెట్టుబడిగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల నుంచి రూ.31.38 లక్షల లోన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. అలాగే ఘాజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఒక అపార్ట్‌మెంట్, భువనేశ్వర్‌లో మరో నివాస గృహం కలిపి సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లను ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్య కలిగి ఉన్నారు.
2011 మోడల్ హోండా సిటీ కారు, 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి కూడా తమ వద్ద ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.13.5 లక్షలు. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి ఉండగా, వాటి విలువ సుమారు రూ.35 లక్షలు. కంప్యూటర్, గృహోపకరణాలు వంటి ఇతర వస్తువులు కలిపి మరో రూ.6 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: స్కూల్‌లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!


