సీజేపీ నిరసనలకు మద్దతుగా అన్నా హజారే ‘మౌన ఆందోళన్‌’ | CJP protest Anna Hazare holds Maun Andolan | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసనలకు మద్దతుగా అన్నా హజారే ‘మౌన ఆందోళన్‌’

Jul 23 2026 5:16 PM | Updated on Jul 23 2026 5:27 PM

CJP protest Anna Hazare holds Maun Andolan

ముంబై: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో 2 గంటల పాటు మౌన ఆందోళన్‌ చేపట్టారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.

ఉదయం 11 గంటలకు అహిల్యానగర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన మొదలుపెట్టి, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు. ఆ తర్వాత అదే జిల్లాలోని తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నా హజారే లేఖ రాసిన విషయం తెలిసిందే. "హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయి" అని అందులో పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా, సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పని తీరు మరింత జవాబుదారీతనంతో, సమర్థంగా మారుతుందని ఆయన చెప్పారు. నిరసనకారుల మాటలను ఓర్పుగా వినాలని, నమ్మకం పెంచే వాతావరణం కల్పించాలని, సానుకూల చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మౌన ఆందోళన్‌ తర్వాత విలేకరులతో మాట్లాడిన హజారే.. "ప్రజల సమస్యలు ప్రధానమంత్రికి తెలియాలి. అందుకే ఆయనకు లేఖ రాశాను" అని చెప్పారు.

మరోవైపు, గురువారం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల కారణంగా సాయంత్రం 6.30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్‌లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.

నిరసన ప్రాంతం బయట పూర్తిగా ధ్వంసమైన కారును ఢిల్లీ పోలీసులు ఉంచారని సీజేపీ ఆరోపించింది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ముందు అద్దం ఉన్న ఆ కారు దృశ్యాలు షేర్‌ చేస్తూ.. "ఈ కారును ఇక్కడికి ఈ స్థితిలో తీసుకొచ్చారు. తర్వాత శాంతియుత నిరసనకారులపై నెపం మోపకుండా ముందే నమోదు చేసుకోవాలి" అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement