రుద్రమదేవిలా హైదరాబాద్‌ నుంచి జంతర్‌ మంతర్‌కు అమ్మాయి | coming solo to Jantar Mantar She is from Hyderabad | Sakshi
Sakshi News home page

రుద్రమదేవిలా హైదరాబాద్‌ నుంచి జంతర్‌ మంతర్‌కు అమ్మాయి

Jul 23 2026 7:45 PM | Updated on Jul 23 2026 8:17 PM

 coming solo to Jantar Mantar She is from Hyderabad

న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్‌కు వస్తున్నారు. ఓ అమ్మాయి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి వీడియో తీసి పోస్ట్‌ చేసింది.  

‘‘అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండటంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరూ తెలియరు. అయినా సరే... ఎలాగోలా ధైర్యం చేసి బయల్దేరాను. నాకు తెలుసు...’’ అని ఆమె వ్యాఖ్యానించింది.

ఒకరు ఎక్స్‌లో ఇదే వీడియోను పోస్ట్‌ చేస్తూ... ‘‘ఈమె హైదరాబాద్‌కు చెందిన యువతి. ఈమె పేరు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన దిశ. దిశ ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ర్యాపిడో బైక్‌లో నేరుగా నిరసన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది.

తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని దిశ తెలిపింది. ఢిల్లీ చేరిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ముందుగానే చెప్పి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్పలేదని తెలిపింది. అయితే తనకు నమ్మకమైన ఓ స్నేహితుడికి ప్రతి విషయం చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. 

దారిలో కలిసిన మంచి మనసున్న వారు ఆమెకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. దిశ రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ నేలపై పుట్టిన యువతి. తెలంగాణ మహిళలు ఒకప్పుడు తుపాకీ చేతబట్టి రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి ధైర్యసాహసాల సంప్రదాయం నుంచి వచ్చిన వారే వారు. దిశపై ఎంతో గర్వంగా ఉంది. మనందరి గొంతును ఆమె బలంగా వినిపిస్తుందనే నమ్మకం ఉంది. ముందుకు సాగు దిశ. ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని అందులో పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఆందోళనలు
నీట్ యూజీ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రశ్నపత్రం లీక్ అంశంపై ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా సీజేపీ తన ఆందోళన కొనసాగిస్తోంది.

దేశవ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన చేపడుతున్నామని సీజేపీ తెలిపింది. అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది. "సమావేశాల ముందు విద్యార్థుల డిమాండ్లను గట్టిగా చదవాలి. పోలీసుల దౌర్జన్యానికి గురైన వారికి సంఘీభావం ప్రకటించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై" అని ప్రకటనలో పేర్కొంది. "జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్" వంటి సానుకూల నినాదాలే ఇవ్వాలని, జరిగిన ప్రతిదాన్ని రికార్డు చేయాలని ఆందోళనకారులకు సూచించింది.

ఏ పరిస్థితి ఎదురైనా శాంతియుతంగా, అహింసా మార్గంలోనే నిరసన కొనసాగించాలని సీజేపీ తెలిపింది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే ఉండాలని, అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే, పరువునష్టం కలిగించే, మత విద్వేషం రెచ్చగొట్టే లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement