ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్‌కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.
అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్‌గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్‌ఎస్‌ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.
కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు.


