సాగుబడి: వానను బట్టి పంట విస్తీర్ణం.. | Innovative ICARDA Cultivation Techniques For Investment | Sakshi
Sakshi News home page

సాగుబడి: వానను బట్టి పంట విస్తీర్ణం..

Jul 21 2026 8:51 AM | Updated on Jul 21 2026 9:25 AM

Innovative ICARDA Cultivation Techniques For Investment

ఐసీఏఆర్డీఏ సాగు మెళకువలు

వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షాధార భూముల్లో పెట్టుబడి నష్టపోకుండా పంటలు పండించే వినూత్న మెళకువలను అంతర్జాతీయ మెట్ట  ప్రాంత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్డీఏ) ఐక్యరాజ్యసమితితో కలిసి ప్రచారం చేస్తోంది. పంటకు పూర్తిగా సరిపడా వర్షపాతం కురిసే పరిస్థితి లేనప్పుడు, రైతు తనకున్న వర్షాధార భూమి మొత్తంలో పంటలు వేసుకుంటే తేమ చాలక పంట అసలేమీ చేతికి రాదు. దీనివల్ల రైతుకు పూర్తి నష్టం వాటిల్లుతుంది.

దీనికి ప్రత్యామ్నాయంగా, వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పొలంలో కురిసే వర్షాన్ని వీలైన పద్ధతిలో ఒడిసిపట్టుకోవాలని సంస్థ సూచిస్తోంది. పొలంలో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి, మిగతా భాగంలో పంట వేసుకుంటే ఆ కాస్త పంటయినా దక్కుతుంది. పొలంలో ఎత్తయిన  ప్రాంతంలో కురిసి, లోతట్టు భాగంలోకి ప్రవహించే నీటిని మాత్రమే మనం సంరక్షించుకోగలమని, దీనివల్ల కరువును కొంతవరకు అధిగమించవచ్చని ఐసీఏఆర్డీఏ పేర్కొంది.


ఉదాహరణకు.. ఒక రైతుకు 4 హెక్టార్ల భూమి ఉంది. ఏడాదికి 150 మి.మీ. వర్షపాతం కురిస్తే అక్కడ సాధారణంగా ఏ పంటా పండదు. కానీ వాన నీటిని బయటకు పోనివ్వకుండా సంరక్షించుకుంటూ.. సగం పొలాన్ని ఖాళీగా ఉంచి, రెండో సగంలో పంటలు వేస్తే ఆ భాగానికి 300 మి.మీ. నీరు లభిస్తుంది. ఆ నీటితో కరువును తట్టుకునే పంటలు చేతికొస్తాయి. అదేవిధంగా, ము΄్పావు వంతు (3 హెక్టార్లు) భూమిలో వాన నీటిని సంరక్షించుకొని, మిగిలిన పావు వంతు (1 హెక్టారు) భూమికి మళ్లిస్తే, అక్కడ ఏకంగా 600 మి.మీ. నీరు అందుబాటులోకి వచ్చి పంటలు సమృద్ధిగా పెరుగుతాయి. వర్షపు నీటి సేకరణ ద్వారా తక్కువ వర్షపాతంలోనూ లాభదాయక వ్యవసాయం చేయవచ్చన్నది ఐసీఏఆర్‌డీఏ భావన.                                  

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement