వ్యవసాయ కార్మికుల ఆదాయం
2035 నాటికి సంపన్న దేశాల్లో వ్యవసాయ కార్మికుల ఆదాయాలు దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 2035 నాటికి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి 13% పెరుగుతుంది. అదే సమయంలో అధికాదాయ దేశాల్లో వ్యవసాయ కార్మికుల వార్షిక ఆదాయం 22,155 డాలర్లు ఉంటుందని అంచనా.
దక్షిణాసియా, ఉప–సహారా ఆఫ్రికాలో ఈ ఆదాయాలు 1,100 డాలర్ల స్థాయిలోనే ఉండిపోతాయని అంచనా. ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నప్పటికీ, అల్పాదాయ దేశాల్లో ఆహార భద్రత, పోషకాహార అంతరాలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ), ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) సంయుక్తంగా విడుదల చేసిన కొత్త నివేదిక హెచ్చరిస్తోంది.
ఉత్పాదకత మెరుగుదల కారణంగా రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికునికి సగటు స్థూల వ్యవసాయ ఆదాయం 9 శాతం మేర పెరుగుతుందని అంచనా. ముడిసరుకుల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, వాస్తవ వ్యవసాయ ధరలు స్థిరంగానే ఉంటాయని ఆశిస్తున్నారు.
ఈ నివేదిక ప్రకారం, ప్రతి వ్యవసాయ కార్మికుని వాస్తవ స్థూల ఆదాయంగా లెక్కించిన ప్రపంచ సగటు వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 2035 నాటికి 3,800 డాలర్లుగా ఉంటుంది. ఇది సగటు మాత్రమేన. అధికాదాయ, అల్పాదాయ దేశాల్లోని కార్మికుల మధ్య అంతరం కూడా పోరిగిపోతోంది. అధిక ఆదాయ దేశాలలో 2023–25లో వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 21,100 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2035 నాటికి ఇది 22,155 డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.
ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, ఓషియానియాప్రాంతాల్లో అత్యధిక తలసరి వ్యవసాయోత్పత్తి నమోదవుతుందని అంచనా. ఈప్రాంతాల్లో విస్తారమైన భూకమతాలు ఉంటాయి. తక్కువ శ్రమ, అత్యధిక స్థాయి యాంత్రీకరణ జరుగుతుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, సహారా ఉప–్రపాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని అల్ప ఆదాయప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ప్రస్తుతం సగటున సంవత్సరానికి సుమారు 930 డాలర్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం 2035 నాటికి కేవలం 1,100 డాలర్లకు మాత్రమే పెరుగుతుంది. అంటే దశాబ్ద కాలంలో సుమారు 170 డాలర్లు మాత్రమే పెరుగుతుందని నివేదిక అంచనా వేస్తోంది.
వ్యవసాయ కార్మికుల సగటు ఆదాయాల్లో అంచనా వేసిన 9 శాతం పెరుగుదల ఏమాత్రం సురక్షితం కాదు. వ్యవసాయ మార్కెట్లు అస్థిరతకు గురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, 2035లో ప్రతి కార్మికునికి స్థూల వ్యవసాయ ఆదాయం, అంచనా వేసిన ్రపాథమిక స్థాయి కంటే కనీసం 12 శాతం తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని నివేదిక చెబుతోంది. అల్పాదాయ దేశాల్లో అ లోటు 20 శాతానికి మించి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.
ఆదాయాల్లో ఈ వ్యత్యాసం ఆహార భద్రత, వినియోగ సరళిలో కూడా ప్రతిబింబిస్తుందని నివేదిక కనుగొంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ్రపోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సంపన్న దేశాల్లో అధిక ఆహార వినియోగం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, తక్కువ గృహ ఆదాయాలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా, అల్పాదాయ దేశాలు ఆహార భద్రత, పోషణలో వెనుకబడి ఉంటాయని అంచనా.
పెరగనున్న వ్యవసాయ ఉద్గారాలు
వ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ, సాగుభూమి, పశువుల సంఖ్యను రానున్న పదేళ్లలో ఇంకా కొంత విస్తరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, రాబోయే దశాబ్దంలో ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు 6.5 శాతం మేర పెరుగుతాయని అంచనా. రానున్న పదేళ్లలో పెరిగే వ్యవసాయ ఉద్గారాలలో సుమారు 77 శాతం వాటా పశువుల పెంపకందే ఉంటుందని అంచనా. అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల ద్వారా కృత్రిమ ఎరువులు మిగిలిన 23 శాతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
‘ఉత్పాదకత వృద్ధిని వేగవంతం చేయటం, సాంకేతిక అంతరాలను పూడ్చటం ద్వారా ఉద్గారాల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి లేదా తగ్గించటానికి వీలు కల్పించటమే విధానపరమైన సవాలు. పెరుగుతున్న జనాభాలో మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో.. ప్రపంచ ఆహార భద్రతను, మెరుగైన పోషకాహారాన్ని అందిస్తూనే వ్యవసాయ ఉద్గారాలను నియంత్రించాలి’ అని నివేదిక పేర్కొంది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


